అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్.. నేటి నుంచి అసలు సిసలైన సమరశంఖాన్ని పూరించనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా సరికొత్త వ్యూహాలతో ప్రచారానికి మరింత పదును పెట్టనున్నది. మూడోసారి అప్రతిహత జైత్రయాత్ర కోసం రణన్నినాదం చేయబోతున్నది. నేడు సీఎం కేసీఆర్ నుంచి బీ-ఫామ్స్ అందుకోనున్న అభ్యర్థులు..గడిచిన రెండు నెలలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నియోజకవర్గాలను చుట్టేశారు. జనంతో మమేకమయ్యారు. ఎన్నికల్లో విజయ తీరం చేరేదాకా.. ప్రత్యేక వ్యూహాలతో ఇప్పుడు రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ మ్యానిఫెస్టోతో పాటు నియోజకవర్గ ప్రగతిని అక్షర రూపంలో ప్రజల ముందుంచి.. మరోసారి ఆశీర్వదించాలంటూ ఓటు అభ్యర్థించనున్నారు.
తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో ఓటమి తప్పదని, విపక్షాల కుట్రలను తిప్పికొడుతామని.. ప్రజల మద్దతుతో గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, అభ్యర్థులంతా ప్రచారానికి పదును పెంచే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులోభాగంగానే 16న గ్రేటర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. ఇందులో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో 45 రోజుల ప్రణాళికలకు సంబంధించి బాధ్యతలు అప్పగించనున్నారు. అంతేకాకుండా అభ్యర్థులు వారి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పాదయాత్రలకు శ్రీకారం చుట్టనున్నారు.
-సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తేతెలంగాణ)