కొండాపూర్, ఫిబ్రవరి 1 : క్యాన్సర్‌పై భయం వద్దు, అవగాహన ఉంటే విజయం మనదే అంటూ… హైటెక్‌సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్సిటిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఆదివారం బైక్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో 100 మంది మహిళా రైడర్లు పాల్గొని క్యాన్సర్‌పై అవగాహణ రైడ్‌ను విజయవంతం చేశారు. ర్యాలీని మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ టీ.సాయి మనోహర్, మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్ మితాలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించి ప్రయాణించడం మన ప్రాణాలకు రక్షణయితే, మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి రక్షించుకోగలమన్నారు. మహిళల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఔత్సాహిక రైడర్లు పాల్గొన్నారు.
ఉత్సాహంగా క్యాన్సర్ అవగాహన సైక్లింగ్ ర్యాలీ
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పటల్ క్యాన్సర్ సెంటర్ అధ్వర్యంలో ఆదివారం క్యాన్సర్ అవగాహన సైక్లింగ్ రైడ్ నిర్వహించింది. ఫిట్ ఇండియా, హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ సైక్లింగ్ రైడ్‌లో ఔత్సాహిక నగరవాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. స్టార్ హాస్పటల్ మెడికల్ అంకాలజిస్టు, సీనియర్ కన్సల్టెంట్ సాయినాథ్, సర్జికల్ అంకాలజిస్టు విపిన్ గోయల్, స్టార్ హాస్పటల్ ఎండీ డాక్టర్ గోపిచంద్ మన్నంలతో పాటు పలువురు స్టార్ వైద్యులు, సైక్లిస్టులు, ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.