Miss World 2025 | ఖైరతాబాద్, మార్చి 6 : హైదరాబాద్ వేదికగా మే నెలలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (ఎఐడీఎస్వో), ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ (ఎఐడీవైవో), ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం (ఎఐఎంఎస్‌ఎస్) సంయక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. దేశంలో రాచరిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత మహిళలను అణచివేయడం ప్రారంభించారని అన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం విద్య అనేది కొందరికే దక్కేదని, కాని సావిత్రిబాయి పూలే లాంటి వారి చొరవతో మహిళలు చదువుకున్నారని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ మరోసారి మహిళను బానిసగా చూడటం ప్రారంభమైందని అన్నారు. ఆడపిల్లలను అందమైన వస్తువుగా చూపిస్తూ మార్కెటింగ్ వ్యవస్థ విస్తృతికి ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఆడపిల్లలను ఓ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త, సంఘసంస్కర్త, విద్యావేత్తగా చూపించాల్సి ఉండగా, కమర్షియల్ మార్కెటింగ్ కోసం అందాల పోటీలను నిర్వహిస్తూ మరోసారి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు అలాంటి సాంకేతాలనిస్తుందని, దానిని విరమించుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు.
ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర కన్వీనర్ హేమలత మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు కాస్మోటిక్ కంపెనీలకు వేలాది కోట్ల లాభాలను చేకూర్చేందుకు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ పోటీల వల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందుకు రూ.54కోట్లు ఖర్చుచేయడం అర్థరహితమని అన్నారు. కొలతల ద్వారా అందాన్ని నిర్ణయించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం ఈ ఆలోచన మానుకోవాలని హితవుపలికారు. ఈ సమావేశంలో అటవీ శాఖ విశ్రాంత డిప్యూటీ సెక్రటరీ జి. కృష్ణవేణి, రచయిత, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అలూరి విజయలక్ష్మి, సామాజికవేత్త, న్యాయవాది ఎం. మధు, ప్రొఫెసర్ గంగాధర్, ఎన్. శైలజ తదితరులు పాల్గొన్నారు.