Hyderabad Murder Case | హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ మర్డర్ కేసులో కీలక కాల్ రికార్డింగ్ బయటపడింది. యావన్ హత్యకు ముందు అతనికి ఫోన్ చేసిన యువతి.. తమ ఫ్యామిలీ చేస్తున్న కుట్ర గురించి తెలిపింది. ‘నువ్వు నన్ను వేధిస్తున్నావని పోలీసుల ముందు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు.. నీ మీదకు అంతా రావాలని చూస్తున్నారు.’ అని ఆ కాల్లో పేర్కొంది. ఇదంతా తన బావ ప్లాన్ అని.. చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడని చెప్పింది.
నన్ను రేపు కాలేజీకి వెళ్లవద్దని అంటున్నారు. ఎందుకు అని అడిగితే రేపు పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని అంటున్నారని యువతి ఫోన్ కాల్లో చెప్పింది. స్టేషన్‌కు వచ్చి వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడని చెప్పి, తర్వాత కంప్లయింట్లో ఏం రాయించాలో, మేం అది రాయిస్తామని మా డాడీ అంటున్నారని తెలిపింది. ఈ కేసు అంతా నీ మీదకు రావాలని చూస్తున్నారని చెప్పింది. ఇదంతా మా బావ ప్లాన్ అని తెలిపింది. నేను యాడికి అయితే ఆడికి.. నేను అయితే సంతకం పెట్టేందుకు రెడీగా లేనని చెప్పాను. నేను సంతకం పెట్టను అంటే.. నువ్వు కూడా లవ్ చేస్తున్నావా అని అడుగుతారు.. అందుకే నువ్వు ఏం అనుకుంటున్నావో తెలుసుకుందామని నీకు కాల్ చేశా అని అందులో తెలిపింది. మధ్యలో నేను పిచ్చిదాన్ని.. ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాడు టార్చర్ చేస్తుండు అని చెప్పు. అంతకుమించి ఒక్క మాట మాట్లాడొద్దు.. అక్కడ గాయిగాయి చేయొద్దు.’ అని బెదిరిస్తున్నారని తెలిపారు. మరి ఏం చేయాలని అనుకుంటున్నారని యావన్ అడగ్గా.. మీరు వదిలినా వాళ్లను నేను వదలను అని మా బావ అంటున్నాడని సమాధానమిచ్చింది. మీరెమన్నా చేసుకోండి.. నేను ఇద్దర్నీ వదల.. ఇద్దర్నీ చంపేస్తా అని మా బావ అన్నాడని తెలిపింది. అన్నట్లుగానే ఇప్పుడు యావన్ మర్డర్ జరగడంతో ఈ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
యావన్ హత్య కేసులో బయటపడ్డ కాల్ రికార్డింగ్
నువ్వు నన్ను వేధిస్తున్నావని పోలీసులకు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారని, మా వాళ్లు నీ మీదికి రావాలని చూస్తున్నారని, ఇదంతా మా బావ ప్లాన్ అంటూ యావన్‌కు తెలిపిన యువతి https://t.co/RCNveIA9OH pic.twitter.com/tkxTyKKMKa
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2026
జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్‌కు చెందిన ఓ యువతిని స్కూల్ టైమ్ నుంచే ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి కూడా యావన్ అంటే ఇష్టమే ఉంది. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో వారి ప్రేమను వ్యతిరేకించారు. ఈ క్రమంలో యావన్‌కు కొన్నేళ్లుగా యువతి కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు వచ్చాయి. మా పిల్లను వదిలేయ్.. నీతో పెళ్లి చేయడం ఇష్టం లేదని పదే పదే హెచ్చరించారు.
అయినప్పటికీ యావన్ సీతాఫల్మండి ఇందిరానగర్‌లో స్నేహితుడి వద్ద ఉంటూ తరచూ ఆ యువతిని కలుస్తున్నాడు. యావన్ తీరుతో ఆగ్రహంగా ఉన్న యువతి కుటుంసభ్యులు, అతనిపై పగ పెంచుకుని హత్య చేశారు. గురువారం రాత్రి ఆరుగురు వ్యక్తులు మూడు ద్విచక్రవాహనాలపై యావన్ ఇంటికి వచ్చి, టీవీ చూస్తున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తినా వదలకుండా విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు యావన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడు.
ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ యువతి బంధువులు శుక్రవారం ఆందోళనకు దిగారు. యావన్‌ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అనంతరం యువతి ఇంటిపై దాడి చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇది గమనించి పోలీసులు భారీగా మోహరించి వారిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ హత్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా ఐదుగురు నిందితులను గుర్తించారు. వీరిలో పరమేశ్, వంశీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగతా వారికోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నారు.