సిటీబ్యూరో, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ తీగలకున్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను మూడు రోజుల పాటు ఆగమేఘాల మీద తొలగించిన విద్యుత్ శాఖ అధికారులు తిరిగి అదేస్థానంలో వాటిని అమరుస్తున్నారు. అయితే రామంతాపూర్‌లో విద్యుదాఘాతం ఘటన కారణంగా ఐదుగురు మరణించిన ఘటనను డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్. మూడు రోజుల కిందట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నగరంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న ప్రైవేట్ కేబుళ్లన్నిటినీ తొలగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
దీంతో విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు చేపట్టారు. కేబుల్ వైర్లను కట్‌చేసి ఎక్కడపడితే అక్కడ కుప్పలుతెప్పలుగా పడేశారు. అయితే విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను కట్టుకునేందుకు ప్రభుత్వానికి రూ.కోట్లలో డబ్బులు చెల్లించామని నెట్వర్క్ ప్రొవైడర్లు కోర్టును ఆశ్రయించడంతో వెంటనే అధికార యంత్రాంగం కేబుళ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. విద్యుత్ అధికారులు, జీహెచ్ఎంసీ తీరుతో మూడు రోజులుగా ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో గ్రేటర్ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యమైన పనులన్నీ ఆగిపోయాయి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా ఏమైనా సాధించకుండా మునపటి విధానమే అమలు చేస్తుండటం వల్ల తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది.
నగరంలో విద్యుత్ శాఖ చేపట్టిన కేబుల్ వైర్ల తొలగింపును మాత్రమే ఆపాలని హైకోర్టు చెప్పింది. దీనిపై విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదంతా పక్కన పెట్టి విద్యుత్ అధికారులు తొలగించిన స్థానంలో తిరిగి అమరుస్తున్నారు. ఈ హడావుడి నిర్ణయం వెనుక ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ సిబ్బంది మొత్తం కదిలి తీగలను ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా కత్తిరించేశారు. వెంటనే గుట్టుచప్పుడు కాకుండా యథాస్థితిలో అమర్చే పనిలో పడ్డారు. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్ ప్రొవైడర్లు, తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పెద్దలకు మధ్య సయోధ్య కుదరిందా? అనే చర్చ జరుగుతోంది. డీల్‌లో భాగంగా భారీగానే ముడుపులు అందాయనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాని గురించి ప్రజల్లో చర్చ జరగకుండా దృష్టి మళ్లించడంలో కాంగ్రెస్ సర్కార్ ఆరితేరిపోయింది. రాజకీయ పరమైన అంశాలతో పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలు, విషాద ఘటనల్లో కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. కేబుల్ వైర్ల తొలగింపు, అమర్చడం కూడా కాంగ్రెస్ ప్రాథమిక సూత్రంలో భాగమేనని నగర ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. పాలన చేతకాక ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ వైఫల్యం వల్ల నగరంలో జరిగిన వరుస విద్యుదాఘాతాలను పక్కకు పెట్టేందుకే ఈ ఇంటర్నెట్ కటింగ్ డ్రామాకు తెరలేపినట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.