సిటీబ్యూరో, జులై 3 (నమస్తే తెలంగాణ): నగరంలో ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలు క్యాబ్ సర్వీస్ ధరలు రెట్టింపు అవుతాయి. అదేంటని అనుకుంటున్నారా? ఔను రద్దీ వేళల్లో క్యాబ్ సంస్థలు ధరలను రెండింతలు పెంచుకోవచ్చని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ లెక్కన నగరంలో సమయంతో సంబంధం లేకుండా రద్దీ తలపించే ప్రాంతాలు అనేకం. నగర జనాభాను దాటిపోతున్న వాహనాల సంఖ్యతో ఉదయం, రాత్రి తేడా లేకుండా రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి.
ఇక వర్షమొస్తే ఆ పరిస్థితి నరకాన్ని పరిచయం చేస్తుంది. నగరంలో అత్యధిక భాగం రద్దీ ప్రాంతాలే. ఈ పరిస్థితుల్లో నగరవాసులు ఎటైనా ప్రయాణం చేయడానికి క్యాబ్ సర్వీస్ ఉపయోగించుకోవాలనుకుంటే సంస్థలు అధిక ధరలతో ముక్కుపిండనున్నాయి. ఇప్పటికే భగ్గుమంటున్న ధరలకు ఏ యాప్‌లో తక్కువ ధర ఉందని వెతుక్కొని అందులో రైడ్ బుక్ చేసుకుంటున్నారు నగర ప్రయాణికులు.
ఇక కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో ప్రతీ యాప్ ప్రయాణికుల జేబు గుల్ల చేయడానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా బేగంపేట, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కోఠి, దిల్షుక్నగర్, అమీర్‌పేట, కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాలన్నీ అటు విద్యాలయాలు, ఇటు ఆఫీసు కార్యాలయాలతో నిండి ఉంటాయి. సమయంతో సంబంధం లేకుండా ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉంటాయి. ట్రాఫిక్ జామ్, వర్షం, కస్టమర్ల డిమాండ్లను సాకుగా చూపి క్యాబ్ సంస్థలు ధరలు పెంచి ప్రయాణికులను దోచుకోనున్నాయి. రద్దీ వేళల్లో క్యాబ్ ధరలు రెండింతలు పెంచుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయడంపై కస్టమర్లు భగ్గుమంటున్నారు.
ఇప్పటికే క్యాబ్ సంస్థలు ఇష్టానుసారంగా రైడ్ ధరలు నిర్ణయిస్తూ పరీక్ష పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు అడిగినంత రైడ్ ధర ఎంపిక చేసే వరకు రైడ్ బుక్ కాకుండా ఆలస్యం అయ్యేలా యాప్ నిర్వాహకులు మాయాజాలం చేస్తున్నారని వాపోయారు. సికింద్రాబాద్ నుంచి సీతాఫల్‌మండికి 2.6 కిలో మీటర్ల దూరం. ఈ దూరానికి ఇప్పటికే క్యాబ్ రూ.140, ఆటో 90, బైక్ 60 చూపిస్తుంది. ఇప్పుడు రద్దీ వేళల్లో వీటి ధరలు సుమారుగా 300 వరకు క్యాబ్ సంస్థలు పెంచుకోవచ్చు. ఈ ధరలతో నష్టపోయేది సాధారణ ప్రజలే. ఇలా ప్రతీ దూరాన్ని ఆధారంగా ఇకపై ఆన్లైన్ ఆధారిత వాహన సేవలు డబుల్ అవనుండటంతో నగర ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మార్గదర్శకాలపై తెలంగాణ వాహన సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి తెలంగాణలో ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర ఆన్లైన్ ఆధారిత వాహన సేవలకు అనుమతి లేదు. అవి నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలపై తాము రవాణా శాఖ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ సలావుద్దీన్ తెలిపారు. ఈ సంస్థలతో డ్రైవర్లకు కూడా లాభాలు రావడం లేదని.. కమీషన్ల రూపంలో సంస్థలు దోచుకుంటున్నాయని పేర్కొన్నారు.
స్పష్టమైన విధి విధానాలు కేంద్రం ప్రకటించలేదని విమర్శించారు. దేశంలో కిలో మీటర్ల ఆధారంగా ఒకే ఫేర్ ధర ఉండాలనే నిబంధన కేంద్రం ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. డ్రైవర్లకు సైతం లాభాలు ఉండేలా, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా యాప్ నిర్వహణ ఉండాలని కోరారు. ప్రభుత్వమే యాప్ తీసుకొచ్చి డ్రైవర్లతో సేవలు అందించాలని టీఏటీయూ అధ్యక్షుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు. డ్రైవర్ల సంక్షేమం పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న కంపెనీలకు లాభాలను చేకూర్చే విధానాలు సరైనవి కావనీ ఆయన విమర్శించారు.