సుల్తాన్‌బజార్, డిసెంబర్ 18 : క్యాబ్ డ్రైవర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ తెలంగాణ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దూపం ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హనుమాన్‌టేక్డీలోని బీసీ సాధికారత భవన్లో అసోసియేషన్ మూడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లేపల్లి జగన్మోహన్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్లుగా సేవా భారత్ అవార్డు-2022కు ఆరుగురిని ఎంపిక చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిట్యాల ప్రేమ్చందర్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మీనారాయణ, సలహాదారులు ఈశ్వర్, ఇన్చార్జిలు రవికుమార్ గుప్త, రాసాని మధు, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీశైలంలు అవార్డుకు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, ఈశ్వర్, శ్రీశైలం, మధు, ఇన్చార్జులు నాగబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.