Hyderabad | హైదరాబాద్‌లో వృద్ధురాలి మిస్సింగ్ కేసును నాచారం పోలీసులు చేధించారు. బంగారం కోసం ఇంట్లో కిరాయికి ఉంటున్న క్యాబ్ డ్రైవర్‌నే హత్య చేశాడని గుర్తించారు. అంతేకాదు మృతదేహాన్ని స్నేహితుల సాయంతో ఏపీలోని రాజోలు సమీపానికి తీసుకెళ్లి అక్కడ గోదావరి నదిలో విసిరేసినట్లుగా విచారణలో తెలుసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కు చెందిన సూరెడ్డి సుజాత్ (65) భర్త, కుమారులు చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లి చెందిన ఎం.అంజిబాబు (33) ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను మల్లాపూర్ బాబానగర్‌లోని సూరెడ్డి సుజాత (65) ఇంట్లో అద్దెకు చేరాడు. భర్త, కుమారులు చనిపోవడంతో సుజాత ఇంట్లో ఒంటరిగా ఉండటంతో.. ఆమె బంగారంపై అంజిబాబు కన్నేశాడు.
ఈ నెల 19వ తేదీన రాత్రి ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న 11 తులాల బంగారాన్ని దోచుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేశాడు. తర్వాత జరిగిన విషయాన్ని తన స్నేహితులు కందవల్లికి చెందిన యువరాజు (18), అమలాపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన దుర్గారావు (35)కి చెప్పి, సొంతూరుకు వెళ్లారు. ఈ నెల 20వ తేదీన ముగ్గురు కారును అద్దెకు తీసుకుని, మల్లాపూర్‌కు తిరిగొచ్చారు. అనంతరం మృతదేహాన్ని కారులో కోనసీమ జిల్లాలోని కృష్ణలంకకు తరలించి, గోదావరిలో విసిరేశారు. అయితే మొయినాబాద్‌లో ఉంటున్న సుజాత చెల్లెలు సువర్ణలత ఈ నెల 24వ తేదీన ఇంటికి రాగా, సుజాత కనిపించలేదు. అనుమానంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అద్దెకు ఉంటున్న అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అతన్ని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న నాచారం పోలీసులు.. మృతదేహం కోసం ఏపీలోని రాజోలుకు వెళ్లారు. అక్కడ గోదావరి నదిలో మృతదేహం కోసం గాలిస్తున్నారు.