బండ్లగూడ, మార్చి 3. రాజేంద్రనగర్ లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన సుధాకర్గౌడ్తో పాటు పలువురు యువకులు నాయకులు పెద్ద ఎత్తున కార్తీక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నదంటూ విమర్శించారు.
ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రజలు నాయకులు యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి చేరేందుకు ఉత్సాహం చెబుతున్నారని ఆయన తెలిపారు. కాగా, రాజేంద్రనగర్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని బండ్లగూడ జాగీర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, శాంతి నాయక్, రాముడు యాదవ్, పాల్గొన్నారు.