సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట శంకుస్థాపన చేసి.. కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. కానీ రోడ్ల విస్తరణ పేరిట వృక్షాలపైకి బుల్డోజర్లను హెచ్ఎండీఏ అధికారులు తీసుకువస్తున్నారు. రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుల కోసం హెచ్ఎండీఏ జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో డిజైన్లు ఖరారు చేసింది. ఇప్పటివరకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. ఓవైపు మెట్రో సంస్థతో సాంకేతిక సమస్యలపై ఇబ్బందులు అలానే ఉన్నాయి.
కానీ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని భారీ వృక్షాలను తొలగించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సిద్ధం అవుతుండటం ఇప్పుడు పర్యావరణ సామాజిక కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. తరలింపు( ట్రాన్స్‌లోకేట్) పేరిట హెచ్ఎండీఏ మార్చి నెలలోనే భారీ వృక్షాలు వేరే చోట నాటేందుకు టెండర్లు ఖరారు చేసింది. కానీ అంతలోనే ఆ చెప్పిన సంఖ్యలో కాకుండా మరో మూడు వేల వృక్షాలను నరికివేసేందుకు సిద్ధం అవుతున్నారు. మొత్తం గుర్తించిన 10వేల వృక్షాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ విషయంలో హెచ్ఎండీఏ చేస్తున్న పనులతో జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేసే వృక్షాల మనుగడ ప్రశ్నార్థకంగామారుతుందని పర్యావరణవేత్తలు ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారు.
ఎటూ తేలని ప్రాజెక్ట్ కోసం..
ఎటూ తేలని ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం భారీ వృక్షాలు బలిపీఠమెక్కుతున్నాయి. రెండు ప్రాజెక్టుల కోసం రోడ్లకు ఇరువైపులా ఉన్న వృక్షాలను తరలించి వేరే చోట నాటనున్నారు. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం రోడ్డు వరకు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించనున్న 18.2 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌తో దాదాపు 10వేల చెట్లు ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్నాయని గుర్తించారు. ఇందులో శామీర్‌పేట్ మార్గంలో 3657 వృక్షాలు, ప్యారడైజ్ మార్గంలో 573 వృక్షాలను ట్రాన్స్‌లోకేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ లెక్క తారుమారైనట్లుగా ఉంది. ట్రాన్స్‌లోకేట్ చేసే వృక్షాలు కాకుండా మరో 3200 చెట్లను నరికివేయడానికి గుర్తించడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణవేత్తల అసహనం..
ఏమాత్రం కదలిక లేని ఎలివేటెడ్ కారిడార్ విషయంలో పర్యావరణానికి చేటు చేసేలా వ్యవహారించడంపై పర్యావరణకార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం భూసేకరణ కూడా ఈ రెండు మార్గాల్లో పూర్తి చేయలేదు. అలాంటప్పుడూ అధిక వయసు కలిగిన భారీ వృక్షాలను ఇప్పుడు ఎందుకు నరికివేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్‌లోకేట్ చేయాల్సిన వృక్షాలు కూడా మరో 3వేలను ఎందుకు తొలగిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ట్రాన్స్‌లోకేట్ చేస్తామని ముందుగా చెప్పి… గుర్తించిన వాటిలో 3వేల వృక్షాలను నిర్జీవం చేసేందుకు సిద్ధం అవుతున్నారని మండిపడుతున్నారు.
దీనిపై అధికారులు కూడా ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతోపాటు, పర్యావరణానికి బలిపీఠం ఎక్కించేలా నరికివేయాల్సిన వృక్షాల సంఖ్య ఎందుకు పెరిగిందనేది ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ స్థాయిలో వృక్షాలను నిర్వీర్యం చేయడం కంటే… ప్రత్యామ్నాయ మార్గాలను ఎందుకు అన్వేషించడం లేదని, కనీసం పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేస్తూ వాటిని కూడా ట్రాన్స్‌లోకేట్ చేసేలా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ తీసుకున్న ఈ నిర్ణయంపై పర్యావరణానికి నష్టం కలిగిస్తే ఆందోళనలకు పర్యావరణ కార్యకర్తలు సిద్ధం అవుతున్నారు.