Hyderabad | సుల్తాన్ బజార్, జూలై 5 : స్నేహితుడిని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన శనివారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎం స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. జాంబాగ్ వకీల్వాడిలోని సాయి సంతోషి అపార్ట్మెంట్లో నివసించే సంజయ్ సాంచెటి జైన్(52) బేగం బజార్ కొల్సవాడిలో న్యూ ఇషిక టాయ్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన ఉదయం 9:30 గంటలకు వ్యాపారం నిమిత్తం షాపుకు వెళ్లాడు. కాగా రాత్రి వరకు ఇంటికి రాలేదు. రాత్రి 9 గంటల సమయంలో సంజయ్ భార్య షాలిని సాంచెటి జైన్ భోజనం చేసేందుకు రావాలని ఫోన్ చేసింది. సంజయ్ తన స్నేహితుని కలిసి వస్తానని తెలిపారు. అయితే అర్ధరాత్రి 12:30 అవుతున్న భర్త రాకపోవడంతో భార్య షాలిని తిరిగి సంజయ్కు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురై.. బంధువులను, అతని స్నేహితులను అప్రమత్తం చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంజయ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.