‘రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ’ ఇది గ్రేటర్ ఆర్టీసీ దుస్థితి. ఫలితంగా విద్యా సంస్థలకు వెళ్లడం.. ఇంటికి క్షేమంగా తిరిగిరావడం విద్యార్థులకు ఒక అగ్ని పరీక్షగా మారింది. విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. అందుకు తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచడంలో ఆర్టీసీ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు బస్సు డోర్ల వద్ద బరువైన బ్యాగులతో వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది.
– సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ)
బస్సులన్నీ ప్రధాన బస్టాండ్‌లోనే కిక్కిరిసిపోతున్నాయి.. ఇక మధ్య మధ్య స్టాపుల్లో విద్యార్థులు ఎక్కే పరిస్థితి ఉండటం లేదు. దీంతో విద్యార్థులు సకాలంలో విద్యాసంస్థలకు చేరుకోవడం సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేతిఫైల్, దిల్సుఖ్నగర్, కోఠి, మెహిదీపట్నం, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కిటకిటలాడుతున్నా యి. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం కూడా విద్యార్థులకు అవరోధంగా మారింది. మెజార్టీ సీట్లలో మహిళలే కూర్చోవడంతో శివార్లకు వెళ్లే విద్యార్థులు గమ్యస్థానం వచ్చే వరకు నిల్చొనే ప్రయాణించాల్సిన పరిస్థితి.

పాస్ ధరలు బారెడు..
ఆర్టీసీకి విద్యార్థుల బస్‌పాస్‌ల ధరలు పెంచడంపై ఉన్న దృష్టి వారి ప్రయాణానికి అనుగుణమైన బస్సులను ఏర్పాటు చేయడంలో లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల బస్‌పాస్‌లతో పాటు ఆర్డినరీ, గ్రీన్ మెట్రో తదితర బస్సు పాస్ ధరలను వరుసగా పెంచుతూనే ఉంది. గత రెండేళ్లలో వివిధ రకాల బస్‌పాస్‌లపై 24 నుంచి 50 శాతం వరకు ధరలు పెంచిన విషయం తెలిసిందే. గ్రేటర్లో సుమారు 3.12లక్షల బస్‌పాస్‌లు ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, టూరిస్టులు, రోజువారి (టీ-24 టికెట్) ప్రయాణికులు ఆర్టీసీ బస్ పాస్‌లు తీసుకుంటారు. ఈ క్రమంలో సరిపడా బస్సులను నడపకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రజా సంఘాలు, విద్యార్థులు కలిసి లక్ష సంతకాల క్యాంపెయిన్ నిర్వహించి బస్సులు పెంచాలని డిమాండ్ చేశారు.
క్యాంపెయిన్ రిపోర్ట్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించారు. మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95శాతానికి పెరిగింది. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్న 2,900 సిటీ బస్సులో రోజుకు 25 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 17 లక్షల మంది వరకు మహిళలే ఉంటున్నారు. ప్రయాణికుల రద్దీ రెట్టింపైనా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు శివార్లకు వెళ్లాలంటే బస్సులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే ప్రధాన మార్గాల నుంచి శివార్లకు డైరెక్ట్ బస్సులు ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితేగానీ కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
రాత్రి సమయంలో అంతంతే..
నగరంలో సాయంత్రం 7 దాటిందంటే బస్సుల రాకపోకలు తగ్గుతున్నాయి. సమయపాలన లేకుండా నడుస్తున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రూట్లల్లో బస్సులు వస్తాయో రావో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. రాత్రి సమయాల్లో బస్సుల రాకపోకలు తగ్గుతుండటంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మరోవైపు బస్సుల సమాచారం సూచీ బోర్డులో ఒకలా.. రాకపోకలు మరోలా ఉంటుండంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రాజు అనే విద్యార్థి తెలిపాడు. గమ్యం యాప్ కూడా అన్ని వేళలా పనిచేయడం లేదని తెలిపాడు. బస్సు వివరాలు ఎంటర్ చేస్తే నాట్ ఫౌండ్ అని చూపిస్తుందని చెప్పాడు. కొన్నిసార్లు బస్సు సర్వీసులు రద్దవుతున్నాయని, ఆ సమాచారం కూడా యాప్ సూచించడం లేదని వాపోయాడు.
