బ్యాట్స్‌మెన్ సమిష్టి కృషికి.. బౌలర్ల నిలకడ.. ఫీల్డర్ల సహకారం తోడవడంతో ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. తలా కొన్ని పరుగులతో భారీ స్కోరు చేసిన ధోనీ సేన.. బౌలింగ్‌లో అద్వితీయ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను కట్టిపడేసింది. జడ్డూ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పితే.. అలీ మూడు వికెట్లతో రాయల్స్ నడ్డి విరిచాడు. ఫలితంగా కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌లో ధోనీ విజయ దరహాసం చేశాడు.
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో ధోనీ సేన 45 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డుప్లెసిస్ (33), రాయుడు (27) రాణించగా.. మిగిలిన వాళ్లు తలా కొన్ని పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో కారియా 3, మోరిస్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. బట్లర్ (49) కాస్త పోరాడాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, సామ్ కరన్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రుతురాజ్ గైక్వాడ్ (10) కాసేపటికే పెవిలియన్ చేరాడు. అయితే డుప్లెసిస్ ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. ఉనాద్కత్ వేసిన నాలుగో ఓవర్లో 4,4,6,4 బాదిన డుప్లెసిస్‌ను మోరిస్ ఔట్ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ధోనీ సేన 46/2తో నిలిచింది. ఆ తర్వాత అలీ (26), రాయుడు కొన్ని చక్కటి షాట్లు ఆడి ఔట్ కాగా.. రైనా (18) తనదైన ముద్ర వేయలేకపోయాడు. రాయుడు, రైనాలను ఒకే ఓవర్లో వెనక్కి పంపిన చేతన్ సకారియా.. కాసేపటికి కెప్టెన్ ధోనీ (18) కూడా బుట్టలో వేసుకున్నాడు. ఆఖర్లో సామ్ కరన్ (13), బ్రావో (8 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడటంతో చెన్నై మంచి స్కోరు చేయగలిగింది.
భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్ వోహ్రా (14) త్వరగానే డగౌట్ చేరినా.. బట్లర్ దంచికొట్టాడు. చాహర్ వేసిన ఐదో ఓవర్లో సూపర్ సిక్సర్ కొట్టిన బట్లర్.. జడేజాకు రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. కెప్టెన్ శాంసన్ (1) త్వరగానే ఔటైనా.. దూబే (17) సహకారంతో బట్లర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 81/2తో నిలిచింది. అయితే జడేజా ఒకే ఓవర్లో వీరిద్దరినీ ఔట్‌చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది. బట్లర్‌ను బౌల్డ్ చేసిన జడ్డూ.. దూబేను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డేవిడ్ మిల్లర్ (2) అలా వెచ్చి ఇలా వెళ్లగా.. రియాన్ పరాగ్ (3), క్రిస్ మోరిస్ (0)లను ఒకే ఓవర్లో ఔట్ చేసిన మొయిన్ అలీ మ్యాచ్‌ను చెన్నై చేతిలోకి తెచ్చాడు. తెవాటియా (20), ఉనాద్కత్ (24) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది.
చెన్నై: గైక్వాడ్ (సి) దూబే (బి) ముస్తఫిజుర్ 10, డుప్లెసిస్ (సి) పరాగ్ (బి) మోరిస్ 33, మొయిన్ (సి) పరాగ్ (బి) తెవాటియా 26, రైనా (సి) మోరిస్ (బి) సకారియా 18, రాయుడు (సి) పరాగ్ (బి) సకారియా 27, జడేజా (సి) శాంసన్ (బి) మోరిస్ 8, ధోనీ (సి) బట్లర్ (బి) సకారియా 18, సామ్ కరన్ (రనౌట్) 13, బ్రేవో (నాటౌట్) 20, శార్దూల్ (రనౌట్) 1, దీపక్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 188/9. వికెట్ల పతనం: 1-25, 2-45, 3-78, 4-123, 5-125, 6-147, 7-163, 8-174, 9-180, బౌలింగ్: ఉనాద్కట్ 4-0-40-0, సకారియా 4-0-36-3, ముస్తఫిజుర్ 4-0-37-1, మోరిస్ 4-0-33-2, తెవాటియా 3-0-21-1, పరాగ్ 1-0-16-0.
రాజస్థాన్: బట్లర్ (బి) జడేజా 49, వోహ్రా (సి) జడేజా (బి) సామ్ 14, శాంసన్ (సి) బ్రేవో (బి) సామ్ 1, దూబే (ఎల్బీ) జడేజా 17, మిల్లర్ (ఎల్బీ) అలీ 2, పరాగ్ (సి) జడేజా (బి) అలీ 3, తెవాటియా (సి) గైక్వాడ్ (బి) బ్రేవో 20, మోరిస్ (సి) జడేజా (బి) అలీ 0, ఉనాద్కట్ (సి) జడేజా (బి) శార్దూల్ 24, చేతన్ (నాటౌట్) 0, ముస్తఫిజుర్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 13 మొత్తం: 20 ఓవర్లలో 143/9. వికెట్ల పతనం: 1-30,2-45, 3-87, 4-90, 5-92, 6-95, 7-95, 8-137, 9-143, బౌలింగ్: దీపక్ 3-0-32-0, సామ్ కరన్ 4-0-24-2, శార్దూల్ 3-0-20-1, జడేజా 4-0-28-2, బ్రేవో 3-0-28-1, అలీ 3-0-7-3.
జట్టు ఆ గె ఓ నె,ర పా
బెంగళూరు 3 3 0 0.75 6
చెన్నై 3 2 1 1.19 4
ఢిల్లీ 3 2 1 0.45 4
ముంబై 3 2 1 0.36 4
కోల్‌కతా 3 1 2 -0.63 2
రాజస్థాన్ 3 1 2 -0.71 2
పంజాబ్ 3 1 2 -0.96 2
హైదరాబాద్ 3 0 3 -0.48 0
ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్ రన్‌రేట్, పా-పాయింట్లు