హయత్‌నగర్, మే 6 : షార్ట్ సర్క్యూట్ కారణంగా 36 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు దాదాపు రూ.40లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని పోలీసులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం …ఎల్బీనగర్ నియోజకవర్గంలోని, నాగోల్ డివిజన్, సాయినగర్ కాలనీ గుడిసెల్లో పలు కుటుంబాలు నివాసముంటున్నాయి.
ప్రతి రోజూ మాదిరిగానే గుడిసెల్లో నివాసముంటున్న ప్రజలు మంగళవారం ఉదయం ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. 11.30 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా రోడ్డు పక్కన గుడిసెల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి.. సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనతో సమీపంలోని గుడిసెల్లోకి కూడా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
స్థానికుల సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అగ్నిమాపక సిబ్బందికి, రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి వెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఈ సహాయక చర్యల్లో రెవెన్యూ, వాటర్ వర్క్స్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. సహాయక చర్యలను పరిశీలించి..బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించేందుకు కృషి చేస్తానని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక అవసరాల కింద రూ.50 వేలు అందజేసి రూ.10 లక్షలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.