జవహర్నగర్, మే 12: ‘కూలీనాలీ చేసుకునేటోళ్లం.. చిన్నపాటి రేకుల ఇంటిని నిర్మించుకుంటే.. మాపైనే మీ ప్రతాపమా.. మేమెట్లా బతకాలి’.. పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. పైసాపైసా కూడబెట్టుకొని.. ఇండ్లు కట్టుకుంటే.. నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారంటూ.. అధికారులు, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కాప్రా తహసీల్దార్ సుచరిత ఆధ్వర్యంలో జవహర్నగర్ కార్పొరేషన్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో సోమవారం పలు పేదల ఇండ్ల కూల్చివేతలు చేపట్టారు. బాలాజీనగర్లో బుచ్చమ్మ అనే మహిళ రేకుల ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు.
తన ఇంటిని కూల్చవద్దని, మా బతుకులు ఆగమవుతాయని.. ఎంత బతిమిలాడినా.. వినలేదు. ఈ క్రమంలో బుచ్చమ్మకు ఆకస్మాతుగా ఫిట్స్ రావడంతో హూటహూటినా దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థతి ఆందోళనకరంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. రెవెన్యూ అధికారుల అత్యుత్సాహంతో పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ జవహర్నగర్ ప్రజలు మండిపడ్డారు. కూల్చివేతలు ఆపకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.