రామంతాపూర్, జూలై 7: రామంతాపూర్ పెద్దచెరువులో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. చెరువు చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెవాసులనే తొలగించడంతో స్థానికంగా అధికారుల తీరును తప్పుబట్టారు. పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా? అని చర్చించుకుంటున్నారు. తమకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాకనే గుడిసెలు తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారని, ఇప్పడేమో తర్వాత ఇస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి కుటుంబానికి డబుల్బెడ్రూమ్ కేటాయించాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చెరువు చుట్టూ శాశ్వత నిర్మాణాలు చేసుకున్న వారు కాకుండా శాటిటైట్ ద్వారా ఎన్నేండ్ల నుంచి గుడిసెల్లో నివాసం ఉంటున్నారో గుర్తించామని, వీరిలో మొత్తం 36 గుడిసెలను గుర్తించామని, వీరిలో 35 మందికి ఇండ్లు మంజూరయ్యాయని, ఒకరికీ మాత్రం రేషన్ కార్డు లేదని ఇంకా మంజూరు చేయలేదని హైడ్రా ఎస్ఐ ముజాఫర్ తెలిపారు.
ముందుగా శాశ్వత నిర్మాణాల జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెలను మాత్రమే తొలగిస్తున్నామని తెలిపారు. గుడిసెలు కోల్పోయిన వారికి డబుల్ ఇండ్లు కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. వీరి లిస్టు హైడ్రా అధికారుల వద్ద ఉన్నదని తెలిపారు. ఉప్పల్ ఏఎస్ఐ మీనా, కానిస్టేబుల్స్, హైడ్రా సిబ్బంది ఉన్నారు.