ఖైరతాబాద్, డిసెంబర్ 16 : సుధీర్ఘ పోరాటాల ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే జరుగుతోందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ అన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు విడిపోయినప్పుడు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని, అదే నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి ఏ2గా ఉన్న చంద్రబాబును తనకు తెలంగాణ టీడీపీ ఇచ్చేయాలని బ్లాక్‌మెయిల్‌కు దిగాడన్నారు.
మరో వైపు తక్షణమే రాష్ట్రాన్ని విడిచివెళ్లాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడితో చేసేదేమి లేక చంద్రబాబు తట్టాబుట్టా సర్ధుకొని ఏపీకి వెళ్లిపోయాడన్నారు. నాటి నుంచి తెలంగాణపై కక్షపెంచుకున్న చంద్రబాబు పగతీర్చుకునేందుకు సమయం కోసం ఎదురుచూశాడన్నారు. తాజాగా 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారడం, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మరో సారి తన పగసాదించుకోనే పనిలో పడ్డాడన్నారు. బాబు డైరెక్షన్లో ప్రధాన మంత్రి మోదీ సహకారంతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్టాన్ని అదోగతి పాలుచేసే పనిలో పడ్డాడన్నారు. భారత రాజ్యాంగంలో కమిటెడ్ బడ్జెట్ అనేది ఉందని, దాని ఆదారంగానే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిపిట్స్, పింఛన్లు, పీఆర్సీ, డీఏలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
దేశంలోని మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌తో సహా 95 శాతం రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు ఇచ్చేసిందని, కాని తెలంగాణలో ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు అక్కసులో మొదటి దశలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల సమస్యల పేరుతో 2024 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 28 వరకు ఒక నెల రోజుల పాటు అప్పటి సీపీ సీవీ ఆనంద్ చేత 144 సెక్షన్ పెట్టించారని, ఇక రెండో దశలో కమిటెడ్ ఎక్స్పెండీచర్లో కోతలు, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి, తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడన్నారు. ఈ కుట్రను తెలంగాణ ప్రజలు గమనించాలని, మరో సారి స్వరాష్ట్ర రక్షణకు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.