సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ‘అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్కూళ్లస్థాయిలో అభివృద్ధి చేస్తాం.. భవనాలను ఆధునీకరిస్తాం..నర్సరీ పాఠాలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లోనే చెప్పించేందుకు చర్యలు తీసుకుంటాం’ అంటూ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 10 నెలల క్రితం ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా వెల్లడించిన మాటలివి..
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. కార్పొరేట్ స్థాయి దేవుడెరుగు కానీ పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలు చెల్లించండి మహాప్రభో అని అంగన్వాడీ సిబ్బంది రోదిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సర్కార్ 6నెలలుగా అద్దెలు చెల్లించలేదు. ఈ క్రమంలో అద్దె బకాయిలు చెల్లించాలని, లేదంటే భవనం ఖాళీ చేయాలంటూ యజమానులు అంగన్వాడీ టీచర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
మూసేసే స్థితిలో అంగన్వాడీలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,400కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 574 సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నిత్యం చిన్నారులకు ఆటపాటలు నేర్పించే కేంద్రాలు నేడు అద్దె చెలించకపోవడంతో మూసేసే స్థితికి చేరాయి. అద్దె భవానాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర సర్కార్ ఆరు నెలలుగా అద్దెలు చెల్లించడంలేదు. దీంతో ఓపిక నశించిన భవనాల యజమానులు అంగన్వాడీలను ఖాళీ చేయాలంటూ టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కొంతమంది టీచర్లు అప్పుచేసి మరీ అద్దెలు చెల్లిస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో చాలావరకు అంగన్వాడీ కేంద్రాలు పేదలు నివసించే బస్తీల్లో ఉంటూ ఆ చిన్నారులకు సరైన పోషకాలు అందించి వారి ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి.ప్రభుత్వం సొంత భవనాలను కట్టించే పరిస్థితి లేకపోవడంతో అద్దె భవనాల్లోనే సెంటర్లు నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీ సెంటర్లు గుండె కాయలాంటివి. సరైన పోషకాలు అందించి వారిని ఆరోగ్య వంతులుగా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి.
గతంలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది అకౌంట్లలోనే అద్దె డబ్బులు వేసేవారు. కానీ ప్రస్తుతం అద్దెకిచ్చిన యజమాని ఖాతాల్లోనే జమచేస్తున్నారు. అద్దె ఎంతైనా సరే ప్రభుత్వం నామమాత్రంగా నెలకు రూ.3వేలు మాత్రమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించే ఆ సొమ్ముతో కనీసం వంటగది కూడా కిరాయికివ్వరు. క్షేత్రస్థాయిలో అద్దెభవనాల కిరాయి ప్రభుత్వం చెల్లించే సొమ్ముకు రెండింతలు పెరిగాయి. దాంతో అంగన్వాడీలే మిగతా రెంట్‌ను తమ చేతినుంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఆరు నెలల నుంచి ఆ కిరాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం గమనార్హం.
బీఆర్ఎస్ పాలనలో బాగుండే..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్దె భవనాలకు చెల్లించాల్సిన సొమ్ము సకాలంలో చెల్లించేవారు. పదిరోజులు ఆలస్యమైనా కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో యజమానులు ఓపిక పట్టేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని శాఖలతో పాటు అంగన్వాడీలు కూడాఅన్యాయమైపోయారు. అద్దెబిల్లులు చెల్లించకపోవడంతో పాటు, అప్‌గ్రేడ్ చేసిన అంగన్వాడీలకు ఇప్పటివరకు ఆయాలను నియమించలేదు. పనిభారమంతా ఒక్కరిపైనే పడుతుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేరుకు మాత్రమే అంగన్వాడీలకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప, ఆచరణలో మాత్రం శూన్యం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ బకాయిలు చెల్లించాలని చిన్నారుల తల్లిదండ్రులు
కోరుతున్నారు.