సిటీబ్యూరో/కొండాపూర్, నవంబర్ 20 : గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లో పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భవనం చుట్టు పక్కల ఉన్న ఇండ్లలోని నివాసితులను తొలుత ఖాళీ చేయించారు. బిల్డింగ్ యజమానికి జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులిచ్చి.. భారీ పోలీసు బందోబస్తు మధ్య బుధవారం ఉదయం కూల్చివేత మొదలుపెట్టి.. అర్ధరాత్రి ముగించారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి పర్యవేక్షణలో హైడ్రాకు చెందిన భారీ యంత్రం సహాయంతో కూల్చివేత పనులు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో భారీ యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. మూడు గంటల పాటు కూల్చివేతల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపి వేసి ఆ తర్వాత మరమ్మతులు జరిపి యంత్రంతో మళ్లీ కూల్చివేతలు జరిపారు. సెక్షన్ 124, 324ల కింద జీహెచ్ఎంసీ అధికారులు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సంబంధిత యాజమానిపై ఫిర్యాదు చేశారు.
సిద్ధిక్‌నగర్ బస్తీలోని 1639 ప్లాట్‌లో నాలుగంతస్తుల భవనం నిర్మాణం ఉంది. దానికి ఆనుకొని ఉన్న ఖాళీ ప్లాట్లయిన 1605, 1638లలో సిల్ట్+2 అంతస్తుల పర్మిషన్తో సదరు యజమాని నిర్మాణ పనులు చేపట్టారు. భవన నిర్మాణ పనుల్లో భాగంగా పుట్టింగుల నిమిత్తం భారీ గుంతలు తీశారు. దీంతో పక్కనే ఉన్న భవన పిల్లర్లు బయటకు వచ్చి, ఒక వైపు ఒరిగింది. పుట్టింగులపై ఇంజినీర్ల పర్యవేక్షణ లేకపోవమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా భూకంపం వచ్చిన మాదిరిగా ఒరిగిపోవడంతో అందులో అద్దెకుంటున్న జనాలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ పూర్తిగా ఒక వైపునకు ఒరగడంతో స్థానికంగా చుట్టు పక్కల ఇండ్లలోని నివాసితులు భయాభ్రాంతులకు గురై జీహెచ్ఎంసీ, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఒరిగిన భవనంతో పాటు దాని చుట్టు పక్కల ఉన్న నివాసితులు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఒరిగిన భవనాన్ని పరిశీలించి, కూల్చి వేసేందుకు నిర్ణయించారు. గురువారం ఉదయాన్నే హైడ్రాకు చెందిన భారీ యంత్రాన్ని ఒరిగిన భవనం వద్దకు తీసుకువచ్చి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. అయితే భవనంలోని వంట గ్యాస్ సిలిండర్లు ఉండటంతో కూల్చివేత పనులు నెమ్మదిగా కొనసాగించారు. దీంతో పాటు పక్కనే ఉన్న మరో భవనానికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఒరిగిన బిల్డింగ్‌ను ఉన్న చోటనే నేలమట్టం చేసేలా పనులు సాగించారు. కూల్చివేత పనులు సాగుతున్న సమయంలో అటుగా స్థానిక ప్రజలు, అద్దెకుంటున్న వారు ఎవరినీ రాకుండా నలువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులతో ఉన్న ఆ భవనంలో మొత్తం 8 పోర్షన్లలో 48 మంది అద్దెకు ఉంటున్నారు. వీరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హోటల్లో పని చేస్తున్న వారు, ఇతర ప్రైవేట్ జాబ్‌లు చేసుకునే వారు ఉన్నారు. ఎక్కువ శాతం అసోం, మణిపూర్‌కు చెందిన చిరుద్యోగులు ఉన్నారు. కాగా భయాందోళనతో కట్టుబట్టలతో బయటకు పరుగులు తీసిన వారు, వారికి సంబంధించిన సెల్ఫోన్లు, సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు, విలువైన వస్తువులు, నగదులు ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులు భవనంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. బుధవారం ఉదయాన్నే భారీ యంత్రంతో కూల్చివేస్తుంటే అద్దెకున్న వారు తమ విలువైన వస్తువులను తెచ్చుకుంటామని పోలీసులను వేడుకున్నా.. ప్రాణపాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనుమతించలేదు. కాగా, అర్ధరాత్రి నుంచి ఒరిగిన బిల్డింగ్ ఎటు వైపు కూలుతుందోనని చుట్టు పక్కల ఉన్న భవనాల యజమానులు, అందులో నివాసముంటున్న వారు కంటి మీద కునుకు లేకుండా రాత్రంగా గడిపారు.
‘కూడబెట్టుకున్న డబ్బులతో పాటు ఉన్న పొలం అమ్మగా వచ్చిన సొమ్ముతో ఇల్లు కట్టుకున్నాం. సొంతింటి కల నెరవేరడంతో పాటు ఎంతో కొంత ఆసరగా అద్దెలు వస్తాయని, పిల్లల భవిష్యత్‌కు భరోసా ఉంటుందన్న గంపెడాశతో కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే నేలమట్టమవుతుంటే భరించలేకపోతున్నాం’ అని ఇంటి యజమానులు లక్ష్మణ్, స్వప్న దంపతులు రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. చేయని తప్పుకు తమకు తీరని నష్టం వాటిల్లడంతో పాటు తమ కుటుంబం రోడ్డుపైకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భవన నిర్మాణం కోసం అడ్డగోలుగా తవ్విన పిల్లర్ల గుంతల వల్లే తమ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
తలా పాపం తిలా పిడికెడు
సిద్ధిక్‌నగర్‌లో 50 నుంచి 100 గజాలలోని స్థలంలో 5 నుంచి 6 అంతస్తులకు మించకుండా భవన నిర్మాణాలు చేస్తున్నారు. వీటిని హాస్టళ్లకు, ఓయో రూంలకు అద్దెకిస్తూ యజమానులు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్మాణదారులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి, ‘మీరు కట్టుకోండి మీ వెనకాల మేముంటామం’టూ అనధికారంగా అండగా నిలుస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుపెట్టుకుని టౌన్‌ప్లానింగ్ అధికారులు కోట్లకు పడగలెత్తారు. అక్రమ నిర్మాణాలతో అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ కూడా చేరుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.