ఖైరతాబాద్, మే 31 : కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ విలువైన భూమికి ఎసరు పెట్టాడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి.. ఏకంగా సర్కార్‌కు చెందిన జాగాలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు..విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రెవెన్యూ అధికారులు.. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, తక్షణమే సర్వేయర్‌ను పంపించి, విచారణ జరిపించి.. ఇది ప్రభుత్వ స్థలమేనని గుర్తించారు. రెండు సంవత్సరాలకు పైగా ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతున్నదని తెలిసినా..అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్‌లోని నెహ్రూనగర్‌లో హనుమాన్ దేవాలయం ఎదురుగా 662 చదరపు గజాల ఖాళీ స్థలం ఉంది. ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం.. స్థలం విలువ కోట్లలో ఉంటుంది. ఈ ఖరీదైన స్థలంపై కన్నేసిన ఖైరతాబాద్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధి గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాన్ని ప్రారంభించాడు. రెండు సంవత్సరాల వ్యవధిలో బోరు వేయడంతో పాటు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించేశాడు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బయటకు రావడంతో ఖైరతాబాద్ తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
ఖైరతాబాద్ నెహ్రూనగర్‌లోని హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న ఈ 662 గజాల స్థలం కబ్జాకు గురైనట్లు వెలుగులోకి రావడంతో ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగంలోని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విభాగానికి అందిన ఫిర్యాదు మేరకు ఖైరతాబాద్ మండల సర్వేయర్ స్థల పరిశీలన నిర్వహించి నివేదిక సమర్పించారు. టౌన్ సర్వే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ జాగా మున్సిపల్ ఖాళీ స్థలంగా నమోదై ఉంది. 554 చదరపు మీటర్లు (662 చదరపు గజాలు) విస్తీర్ణం కలిగిన ఈ భూమి పూర్తిగా జీహెచ్ఎంసీ ఆస్తిగా రికార్డుల్లో ఉన్నట్లు వెల్లడైంది.
ఖైరతాబాద్‌లో ప్రభుత్వానికి చెందిన అనేక ఖాళీ స్థలాలు ఉన్నాయి. గతంలో మార్కెట్లో రోడ్లో జీహెచ్ఎంసీ మరుగుదొడ్లను మాయం చేసి ఇండ్లను నిర్మించినట్లు ఆరోపణలు సైతం వచ్చాయి. తాజాగా నెహ్రూనగర్ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ మాజీ ప్రజాప్రతినిధి కబ్జా చేయడంతో పాటు ఏకంగా జీ+5 నిర్మాణం చేశాడు. అధికారుల అలసత్వంతోనే ఈ నిర్మాణం జరిగిందని, ఇప్పటికే ఖైరతాబాద్‌లోని అనేక ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెహ్రూనగర్‌లోని ఈ సర్కార్ స్థలం కబ్జా విషయాన్ని కూడా జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా.. పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా భవన నిర్మాణం చేశారని, చివరకు స్థానిక ప్రజల దృష్టికి వెళ్లడంతో అధికారుల్లో చలనం వచ్చిందని చెబుతున్నారు. దీంతో సెక్షన్ 461-ఏ ఆఫ్ జీహెచ్ఎంసీ యాక్ట్ 1995 ప్రకారం ఈ భవనాన్ని సీజ్ చేశారు.
కాగా, నెహ్రూనగర్ హనుమాన్ దేవాలయం ఎదురుగా చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాన్ని అక్రమ పద్ధతిలో క్రమబద్ధీకరించుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది. ఖైరతాబాద్ తహసీల్దార్ జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు మండల సర్వేయర్ పరిశీలనలో టౌన్ సర్వే రెవెన్యూ రికార్డ్స్ (టీఎస్ నం.24/1, బ్లాక్-ఎఫ్, వార్డు-83, ఖైరతాబాద్ విలేజ్, కాలమ్ నం.20 ఆఫ్ టీఎస్ఎల్ఆర్) ప్రకారం ఇది పూర్తిగా మున్సిపల్ ఖాళీ స్థలంగా రికార్డులో ఉంది. దీని సైతం తారుమారు చేసే ప్రయత్నంలో ఆ మాజీ ప్రజాప్రతినిధి ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైతే బుల్డోజర్లతో కూల్చివేసే హైడ్రా మాత్రం ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తే ఇప్పటి వరకు హైడ్రా స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పేదల ఇండ్లు కూల్చడంలో శ్రద్ధ చూపే హైడ్రా..అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చే దమ్ములేదంటూ స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
నెహ్రూనగర్‌లోని హనుమాన్ దేవాలయంలో ఎదురుగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణంపై విచారణ కొనసాగుతున్నది. అది ప్రభుత్వానికి చెందిన స్థలం. ఇప్పటికే ఆ భవనాన్ని సీజ్ చేసి నిర్మాణం చేపట్టిన వారిపై ఖైరతాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. విచారణ అనంతరం త్వరలోనే ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తాం.
-శ్రీనివాసులు, ఖైరతాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్