కొండాపూర్, జనవరి 3 : ‘ఫ్యూచర్ సిటీ తర్వాత.. ముందు మాకు మంచి రోడ్లు కల్పించండం’టూ చందానగర్ అపర్ణ హిల్ పార్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డెనియాల నివాసితులు శనివారం రోడ్డెకారు. తమ ఇండ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 3వేల మందితో అపర్ణ హిల్ పార్ నుంచి మియాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ‘2023లో ఎమ్మెల్యే గాంధీ మా సమస్యను అసెంబ్లీలో చర్చించడంతో సమస్య తీరుతుంది అనుకున్నాం. కానీ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడే తప్ప.. మా రోడ్డు పురోగతి సాధించలేదం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మియాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కేఎస్ఆర్ కాలనీ నుంచి అపర్ణ హిల్స్ వెళ్లే వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుందంటూ ఆవేదన చెందారు. మియాపూర్ సర్కిల్ ఉపకమిషనర్ శశిరేఖకు సమస్య విన్నవించుకోగా, సర్కిల్ ఇంజినీరింగ్ డీఈ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు అపర్ణ వాసులు తెలిపారు.