Jelamandali | సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) : దాదాపు కోటిన్నర దాటిన హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయాలంటే జలమండలికి అత్యంత ప్రాధాన్యతతో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా విస్మరించింది. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు అరకొరగా కేటాయించి చేతులు దులుపుకున్నది.
జలమండలి 5580 కోట్ల రూపాయలు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3385 కోట్లు మాత్రమే ఇచ్చింది. వేసవిలోనూ ఏ ఆటంకమూ లేకుండా నగరానికి నీరందించేందుకు నాగార్జున సాగర్ వద్ద నిర్మితమవుతున్న అత్యంత కీలకమైన సుంకిశాల ప్రాజెక్టుకు అరకొర నిధులే ప్రకటించింది. జలమండలికి భారంగా మారిన 4500 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల బకాయిలపై భరోసా కల్పించలేదు.ఈ విషయంలో సబ్సిడీ ఇవ్వాలని 400కోట్ల మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా కేటాయింపుల్లో మాత్రం చిల్లిగవ్వ కూడా విదల్చలేదు
కేసీఆర్ హయాంలో యుద్ధ
నగరవాసులకు తాగునీటి విషయంలో ఏడాది పొడవునా పూర్తి భరోసా దక్కేలా గత కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున సాగర్ సమీపంలో సుంకిశాల వద్ద రూ 2214 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. సుంకిశాల పథకంలో భాగంగా ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సాగర్‌లో నీటి మట్టం 510 అడుగుల దిగువకు (డెడ్‌స్టోరేజీ) పడిపోయినా అక్కడి నుంచి నీరు తీసుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే గత ప్రభుత్వంలో స్థల సేకరణ నుంచి పంప్‌హౌస్ నిర్మాణం వరకు యుద్ధప్రాతిపదికన సాగిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే నత్తనడకన సాగుతున్నాయి. బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో సదరు ఏజెన్సీ ఇప్పటి వరకు 65 శాతం మేర మాత్రమే పనులు పూర్తి చేశారు.
ప్రస్తుతం మూడవ టన్నెల్ పనులు, సుంకిశాల నుంచి కోదండపూర్‌లోని నీటి శుద్ధి కేంద్రాల వరకు 18 కిలోమీటర్ల మేర 3 వరుసలతో భారీ పైపులైన్ నిర్మాణం పనులు, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు డిసెంబర్ నాటికల్లా వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వం కేవలం రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడడం లేదు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై కొనసాగుతున్న ఎస్టీపీలు, సీవరేజీ, వాటర్సేఫ్టీ ప్లాన్లకు 2280 కోట్లు అడిగితే సర్కారు కేవలం 1450కోట్లు మాత్రమే కేటాయించింది. కాగా, నగరంలో అమలవుతున్న ఉచిత మంచినీటి పథకానికి 300 కోట్లు ఇచ్చింది.
సంవత్సరం పొడవునా నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు 30 టీఎంసీలు కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జంట జలాశయాలకు గోదావరి జలాలను తరలించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు పలుమార్లు హామీలిచ్చింది. కానీ బడ్జెట్లో ఈ విషయంపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో నగరవాసులను విస్మయపరిచింది. అత్యంత కీలకమైన తాగునీటి విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లిప్తంగా ఉండడంపై పెదవి విరుస్తున్నారు.