Gruha Jyothi | సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ విద్యుత్ సబ్సిడీలకే సరిపోనున్నది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే కొత్త విద్యుత్ నెట్‌వర్క్‌లకు నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్లకు కలిపి మొత్తం రూ.16410 కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతికే ఈ నిధులన్నీ సరిపోతాయని, కొత్తగా అవసరమైన చోట విద్యుత్ నెట్‌వర్క్‌లను విస్తరించాలంటే నిధులు చాలా కీలకమని నిపుణులు పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్ నెట్‌వర్క్‌ను విస్తృతంగా ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులు ఆయా సంస్థలకు ఎంత మేరకు సరిపోతాయన్నది ప్రశ్నార్థకంగా మారనున్నది.
గృహజ్యోతి పథకానికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2418 కోట్లు కేటాయించింది. దీంట్లో గ్రేటర్లో ప్రస్తుతం 9.4లక్షల మందికి గృహజ్యోతి పథకం అమలవుతుండగా, అందుకోసం యేడాదికి సుమారు రూ.400 కోట్ల వరకు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిస్కం పరిధిలోని అత్యంత కీలకమైన గ్రేటర్లో నాలుగు జిల్లాలు ఉన్నాయి. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి ఉన్నాయి.
నాలుగు జిల్లాల్లో ఉన్న గృహజ్యోతి లబ్ధిదారులకు జీరో బిల్లుల కింద డిస్కంకు ప్రభుత్వం చెల్లించనున్నది. నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యుత్ నెట్‌వర్క్‌ను విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వం ఓఆర్ఆర్కు జీహెచ్ఎంసీ పరిధిని, ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తామని ప్రకటించడంతో దానికి అనుగుణంగా విద్యుత్ నెట్‌వర్క్‌ను భారీ ఎత్తున ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి వేల కోట్ల రూపాయల నిధుల అసవరం ఉంటుంది.