చాంద్రాయణ గుట్ట మే 5: తమ కుటుంబానికి చేతబడి చేయించాడన్న అపోహతో ఓ యువకుడిని నడిరోడ్డుపైన దారుణంగా హత్య చేశారు. ఫలక్‌నుమాలో జరిగిన ఈ ఘటనపై ఏసీపీ ఎంఏ జావీద్, ఇన్సెక్టర్ ఆదిరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. బండ్లగూడకు చెందిన మాజీద్ స్థానిక మహ్మద్ నగర్లో నివాసం ఉండేవాడు. వీరి ఇంటి సమీపంలోనే షేక్ అఖ్తర్ అలీ (72), షేక్ మహ్మద్ అలీ(32), షేక్ ఉస్మాన్ అలీ(25) కుటుంబం నివసించేది.
2018లో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో మాజీద్ కుటుంబం ఫలక్‌నుమాకు వచ్చి వట్టేపల్లి ప్రాంతంలో నివసిస్తున్నది. అయితే బండ్లగూడ నుంచి మాజీద్ కుటుంబం వెళ్లిపోయిన తర్వాత అఖ్తర్ అలీ భార్య అనారోగ్యంతో చనిపోయింది. అంతే కాకుండా ఆయన కుమారులు అనారోగ్యం బారిన పడ్డారు. దీనికంతటికి మాజీద్ కుటుంబం చేతబడి చేయించి ఉంటుందని అఖ్తర్ అలీ గట్టిగా విశ్వసించాడు.
ఈ నేపథ్యంలోనే అక్తర్ అలీ తన కుమారులతో కలిసి శనివారం మధ్యాహ్నం తీగలకుంట రోడ్డులోని బీబీకా చెష్మా సమీపంలో మహమ్మద్ మాజీద్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం అంబర్ పేటలో ఉన్న తండ్రి కొడుకులను పోలీసులు పట్టుకున్నారు. దక్షిణ మండల డీసీపీ స్నేహ మేహ్రా ఆదేశాలతో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.