ఉస్మానియా యూనివర్సిటీ, మే 16: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS set) రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డికి బీఆర్ఎస్వీ(BRSV) నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సెట్ అర్హత పరీక్షకు హాజరుకాబోయే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు చేయడం అన్యాయమన్నారు.
జనరల్ కేటగిరీకి రూ.2000, బీసీలకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.1000 ఫీజు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఎటువంటి ఫెలోషిప్‌లు ఇవ్వకుండా, విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయాలని భావించడం భావ్యం కాదన్నారు. ఆ ఫీజులు చెల్లించలేక విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వాపోయారు.
ప్రభుత్వ యూనివర్సిటీలలో సామాన్య, మధ్యతరగతి, నిరుపేద విద్యార్థులకు సెట్ అర్హత సాధించాలనే కల కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ ఉద్యోగ భర్తీ సన్నద్ధమవుతూ భారీగా ఖర్చు చేస్తున్న తరుణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొంపల్లి నరేశ్, పెద్దమ్మ రమేశ్, శ్రీనునాయక్, కాటం శివ తదితరులు పాల్గొన్నారు.