హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గ్రూప్- 1లో జరిగిన అవకతవకలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) హైకోర్టు తీర్పు అమలు చేయాలని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ బుధవారం డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు విద్యార్థి సంఘాలతో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాల్సి ఉన్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి హాజరు కావడానికి వెళుతుంటే, పోలీసులు తమను మధ్యలోనే అడ్డుకుని నిర్బంధించారన్నారు. ఈ క్రమంలో జరిగిన గలాటలో పోలీసులు తమపై హత్యాయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి హాజరు కానున్న విద్యార్థులపై పోలీసుల భౌతిక దాడులకు తెగబడటం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ గ్రూప్- 1లో తప్పులు జరుగనట్టయితే శాంతి యుతంగా నిర్వహించాలనుకున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసుల సహాయంతో ఎందుకు అడ్డుకున్నట్టు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అటకెక్కించి ప్రజలను, యూరియా కొరతతో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతుంది ప్రజా పాలన కాదు అని, పోలీసు పాలన అని విమర్శించారు. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజా పాలన అన్న చెప్పుకుంటున్న సీఎంరేవంత్రెడ్డి.. పోలీసుల వైఖరిపై ఏం సమాధానం చెబుతావని ఈ సందర్భంగా స్వామియాదవ్ నిలదీశారు.