BRSV | ఉస్మానియా యూనివర్సిటీ : పదవ తరగతి పుస్తకాలలో పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠ్యాంశాన్ని తీసివేయడం దుర్మార్గమని బీఆర్ఎస్వీ నాయకుడు అవినాష్ బాలెంల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాల కాలం తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు, సాగునీరు, ఇతర అనేక రంగాల్లో జరిగిన అవమానాలు, అణచివేతకు గురై ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర చరిత్రను వచ్చే తరానికి తెలియజేయడం మన బాధ్యత అని అభిప్రాయపడ్డారు. గొప్ప ఉద్యమ చరిత్రను తుడిచి వేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏనాడూ, ఎక్కడా ఉద్యమంలో తాను లేనని, రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తెలంగాణ ద్రోహిగానే మిగులుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏనాటికి దీనిని మరిచిపోదని హెచ్చరించారు. పాఠ్యాంశం తొలగింపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించి పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చేలా పోరాడుతామని ప్రకటించారు.