KTR | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అయినా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర సాగించిందని శనివారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూకట్ పల్లి స్థానంలో గెలిచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందన్నారు.
చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతుందన్నారు. చిన్న పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివ్రుద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు.
గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మారని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు.