బన్సీలాల్‌పేట్, జూలై 24: మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలు బన్సీలాల్‌పేట్ డివిజన్లో ఘనంగా జరిగాయి. రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ సహకారంతో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడు రాజీవ్‌సాగర్ ఆధ్వర్యంలోన్యూ బోయిగూడలోని సెయింట్ ఫిలోమినా హైస్కూల్లో గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్య్రాలకు 100 బెంచీలు, దీంతో పాటు 6 నుండి 10వ తరగతి వరకు ప్రతిభ చాటి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్ధులకు 20 సైకిళ్ల పంపిణీ జరిగింది. పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలతో కేటీఆర్‌కు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జనం మెచ్చిన నేతల కేటీఆర్..
అబిడ్స్, జూలై 24: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనం మెచ్చిన నేత అని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి యూసుఫియన్ దర్గాలో చాదర్ సమర్పణ, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు బద్రుద్దీన్, కార్పొరేటర్లు సాయిజెన్ శేఖర్, గీతా ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ నాగేష్, మాజీ హోంమంత్రి తనయుడు ఆజంఅలి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమంలో..
కంటోన్మెంట్, జూలై 24: కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం నియోజకవర్గంలోని మూడో వార్డు కార్ఖానాలోని వయో వృద్ధాశ్రమం ఆర్కే ఫౌండేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు గజ్జెల నగేష్ ఆధ్వర్యంలో రూ.5లక్షల విలువైన పలు వైద్య పరికరాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తమ నాయకుడు ఆదేశాల మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా అనాధలకు అభాగ్యులకు సహాయం చేయడానికి తాము నిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 8 వార్డులతో పాటు 150వ డివిజన్లో పెద్ద ఎత్తున అన్నదానాలు చేపట్టామని అదేవిధంగా మొక్కలు నాటడం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టామని తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, శ్యామ్, పనాస సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో..
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వల్లమల్ల కృష్ణ, కడారి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన మరో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు బోయిళ్ల విద్యాసాగర్, బీఆర్ఎస్వీ నాయకులు రమేశ్‌గౌడ్, హరిబాబు, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా వారియర్ ఇంట్లో ..
పటాన్చెరు రూరల్, జూలై 24: బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్ శశిధర్‌గౌడ్ ఇంట్లో కేటీఆర్ గురువారం తన జన్మదిన వేడుకలను నల్లబాలుగా సోషల్ మీడియాలో పిలిచే శశిధర్గౌడ్పై కాంగ్రెస్ సర్కార్ పగపట్టి కేసుల పేరుతో 20 రోజులు జైలులో పెట్టింది. ఇటీవల బెయిల్ లభించిన శశిధర్‌గౌడ్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని తన వివాసంకు వచ్చాడు. శశిధర్గౌడ్పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను మొదటి నుంచి ఖండించిన కేటీఆర్ తన పుట్టినరోజున ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, బీఆర్ఎస్ పటాన్చెరు కోఆర్డీనేటర్ ఆదర్శ్‌రెడ్డితో కలిసి శశిధర్‌గౌడ్ ఇంటికి వచ్చారు. తన జన్మదిన వేడుకలను శశిధర్‌గౌడ్, అతడి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.నేనున్నానని ఆ కుటుంబంలో ధైర్యం నింపారు.