హైడ్రా భయంతో సెఫ్టెంబర్ 27న కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ‘మీకు అండగా మేమున్నాం.. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం.అధైర్యపడకండి.. ధైరంగా ఉండండి’.. అంటూ భరోసా కల్పించారు. ‘బుచ్చమ్మది ఆత్మహత్య కాదు…? హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్‌రెడ్డి చేయించిన హత్య’ అని ఆరోపించారు.
సర్కారు దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంట్లోని పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పలువురు చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. – బాలానగర్, అక్టోబర్ 28