KTR | పేదల పొట్ట కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంచేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అది బ్యుటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్.. రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెప్పే నేతలు.. రూ. లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తారట..పథకాలు అమలు చేస్తే కమీషన్లు రావని.. మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. మూసీతో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తరు.? దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పి .. సన్న వడ్లకు మాత్రమే ఇస్తున్నారు. రైతులను అన్ని రకాలుగా మోసం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం కందుకూరులో జరిగిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తానని కనిపించిన దేవుళ్లపైన ఒట్లు పెట్టి.. రైతులనే కాదు.. చివరకు దేవుళ్లనూ రేవంత్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)/కందుకూరు
రియల్ ఎస్టేట్ బ్రోకర్లా..
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా పనిచేయడం లేదని రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం 14వేల ఎకరాలను సేకరించామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌తో పాటు కోమటిరెడ్డి, భట్టి, కోదండరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి బస్సు యాత్రల్లో ఊరూరా తిరిగి అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి తిరిగి రైతులకు భూములు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మాటమార్చి ఫోర్త్ సిటీ అంటున్నారని..అది ఫోర్త్ సిటీ కాదని, ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఎద్దేవా చేశారు.
పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అని, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఎలా కడతారని ప్రశ్నించారు. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఫోర్త్ సిటీలో నిర్మిస్తున్న 300 ఫీట్ల రోడ్డు కోసం రైతులు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా సాయం అందిస్తుందని ప్రకటించారు. ట్రిపుల్ఆర్ను కేంద్రం వాటాతో పూర్తి చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ..ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందని రేవంత్ చెబుతున్నారని, కోమటిరెడ్డి సహా అస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చి దోచుకోవడమే ఆయన ప్రయత్నమని ఆరోపించారు.
ప్రతి పల్లె ఆందోళనలకు సిద్ధం కావాలి
కందుకూరులో జరిగిన రైతు ధర్నా స్ఫూర్తితో ప్రతి పల్లె ఆందోళనలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక్కడ మొదలైన రైతు నిరసన రాష్ట్రమంతా విస్తరిస్తుందన్నారు. కందుకూరు అంటే కేసీఆర్‌కు అభిమానమని, దాసర్లపల్లిలో ఉన్న ఫాంహౌస్‌లో వాటర్ మిల్లర్, బొప్పాయి పండిచ్చేవారని, వారంలో ఒకటి, రెండు సార్లు తాను కూడా ఇక్కడకు వచ్చేవాడినని చెప్పారు. ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమతోనే సబితక్క అడిగిన వెంటనే కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారని పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న రైతు ధర్నా ప్రపంచానికి తెలియవద్దనే సీఎం రేవంత్ ఫాక్స్‌కాన్ సందర్శన కార్యక్రమాన్ని పెట్టుకున్నారని విమర్శించారు.
Ktr
ధర్నా సూపర్ సక్సెస్
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రైతు ధర్నా సూపర్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ శ్రేణులు రైతన్నలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ధర్నాలో పాల్గొని బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ఈ రైతు ధర్నాలో ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి, వికారాబాద్ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ నాయకులు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి, రజినీ సాయిచంద్, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, మదర్ డెయిరీ స్టేట్ మాజీ చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేవంత్.. ఆగస్టు 15 ఇంకా రాలేదా?
-సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
రుణమాఫీపై అన్ని దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్‌కు ఆగస్టు 15 ఇంకా రాలేదా?. మైక్ తీసుకుంటే చాలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలేది లేదు. ఫాక్స్ కాన్ కంపెనీ తెచ్చిందే కేసీఆర్. లక్ష ఉద్యోగాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. నాకు మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని రేవంత్ అంటున్నారు. అవి ఎక్కడ ఉన్నా కూల్చుకోవచ్చు.
రేవంత్‌కు కూల్చడం తప్ప..కట్టడం తెలియదు
– కార్తిక్‌రెడ్డి, బీఆర్ఎస్ యువనేత
నాకు ఒక్కటే ఇల్లు ఉంది. మూడు ఫామ్‌హౌస్‌లు ఎక్కడ ఉన్నాయో.. రేవంత్ చెప్పాలి. కేసీఆర్‌కు నదుల గురించి తెలిస్తే.. రేవంత్‌కు ఫామ్‌హౌస్‌ల నుంచి మురుగు నీరు ఎక్కడెక్కడ పారుతుందో తెలిసినట్లుంది. కూల్చడం కాదు.. దమ్మూధైర్యం ఉంటే ఫార్మాసిటీని ఏర్పాటు చెయ్యి.. మెట్రో సదుపాయాన్ని కల్పించాలి. మెడికల్ కాలేజీని నిర్మించాలి. రైతులను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్‌దే. రేపు మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.
రుణమాఫీ విషయంలో తలోమాట
– మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రేవంత్ పాలనలో అమలు చేస్తున్నవన్నీ ఫెయిల్యూరే. ఇంత దరిద్రమైన సీఎంను నేనెప్పుడూ చూడలేదు. రుణమాఫీ విషయంలో రైతులను గోస పెడుతున్నారు. దసరా తర్వాత ఇబ్రహీంపట్నంలోనూ రైతు ధర్నా నిర్వహిస్తాం.
రైతును రాజుగా చేసిన ఘనత కేసీఆర్‌దే..
– సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ
పీవీ నర్సింహారావు రైతు కూలీని రైతుగా చేస్తే..రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజల దృష్టి ని మరల్చే ప్రయత్నం చేయడం తప్పితే.. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా, రుణమాఫీ వంటివి చేయ డం లేదు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పును చేస్తున్నది.
నమ్మి మోసపోయాం
సీఎం రేవంత్‌రెడ్డిని నమ్మి మోసపోయాం. ప్రజలకు ఇస్తానన్న మాట ప్రకారం నిలబడత లేడు. మాకు ఇస్తానన్న పింఛన్లు ఇవ్వడం లేదు. మహిళల ఉసురుతగలుతది. బతుకమ్మ చీరలు లేవు. కేసీఆర్ సారే బాగుండు. కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం కాను.
-వెంకటమ్మ
మాటలకు చేతలకు పొంతన లేదు..
సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదు. రుణమాఫీ చేస్తానని చెప్పాడు. రైతు బంధు పెంచుతానని చెప్పిండు. రైతు బంధు లేదు.. రుణమాఫీ లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ పాలనలో ఇట్లుండేనా.. చెప్పినట్లు చేసిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరుగబడాలి.
-కాలె శంకరయ్య, ఆకులమైలారం
ఫోర్త్‌సిటీ పేరుతో మోసం
సీఎం రేవంత్‌రెడ్డి ఫోర్త్‌సిటీ పేరుతో మోసం చేస్తుండు. మూడు రోడ్లు ఉండగా మరో 3వందల అడుగుల రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తుర్రు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తే పొంతన లేని సమాధానం ఇస్తుండ్రు. ఫోర్త్ సిటీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రియల్ వ్యాపారం చేస్తుండ్రు. ఫార్మాసిటీని రద్దు చేసి పొలాలను తిరిగి రైతులకు ఇస్తానన్న హామీ ఏమైంది.
-నీరటి శ్రీకాంత్, అగర్మియగూడ
మాట తప్పిన రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన మాట తప్పిండు. సన్నాలకు రూ. 500 ఇస్తానని చెప్పిండు. రైతు బంధు, రూ. 15వేలు ఇస్తానన్నాడు. రుణమాఫీ చేస్తానని మాట తప్పిండు. రైతుల ఉసురు ఊరికే పోదు. రైతు నిరుత్సాహంగా ఉన్నారు. సమయం వచ్చినప్పడు అన్నదాతలు గుణపాఠం చెబుతారు. రేవంత్‌రెడ్డిని గద్దె దింపాలి.
-చల్లా శేఖర్‌రెడ్డి, జైత్వారం, కందుకూరు.
మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల నోట్లోనే ఉంది. రేవంత్‌రెడ్డి.. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చొద్దు. మాపై కక్ష ఉంటే.. మా ఇండ్లు, నిర్మాణాలు కూలగొడితే నీ కండ్లు చల్లబడతాయి అనుకుంటే కూలగొట్టు కానీ.. పేదల ఇండ్లను మాత్రం కూల్చవద్దు. రెడ్డికుంటలో ఉన్న సీఎం ఇల్లు కూడా చెరువు భాగంలోనే ఉంది. మొదట దాన్ని కూల్చాలి. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా చెరువు భూమిలోనే ఉంది. దాన్ని కూడా కూలగొట్టాలి.
గతేడాది డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. పది నెలలు గడిచినా.. ఇంతవరకు రుణ మాఫీ చేయలేదు. చారాణా రుణమాఫీ చేసి.. మొత్తం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారు.
-కేటీఆర్