పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ ఒక ఉదాహరణ.. కనీసం పాఠ్య పుస్తకాలు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వాళ్ల ఇల్లు కూల్చేశారు. గర్భిణీ మహిళ ఎంత వేడుకున్నా.. సామగ్రి తీసుకోవడానికి సమయం ఇవ్వలేదు. కస్తూరి అనే మహిళ చెప్పుల దుకాణం నడుపుకొంటే ఆమె షాపును తొలగించారు. పేదోళ్ల ఇండ్లు కూల్చేస్తున్న ఘటనలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. కాంగ్రెస్ సర్కారు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నది. హైడ్రా బాధితులకు న్యాయపరంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను వారు సంప్రదించవచ్చు.
-కేటీఆర్
KTR | సిటీబ్యూరో/ బాలానగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్.. హైడ్రా పేరుతో హైడ్రామాలు మాని.. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చెయ్యి.. బలిసినోడికి ఒక న్యాయం.. పేదోళ్లకు ఒక న్యాయమంటే ఊరుకునేది లేదు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చినోళ్లు..బిల్డర్లపై చర్యలు తీసుకో.. మీ మంత్రులు.. మీ సోదరుడి ఇండ్లు కూల్చేసి నిజాయితీ నిరూపించుకో. ఏకపక్షంగా కూల్చివేతలు జరిపితే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం’ అంటూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బుధవారం ఆయన గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఫతేనగర్, ఖాజాకుంట చెరువుల వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీలను సందర్శించారు. అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హైడ్రా కమిషనర్ కూర్చునే బుద్ధభవన్, జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం, దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంటున్న సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం, మంత్రుల ఫాంహౌజ్‌లను కూల్చేసి.. నిజాయితీ నిరూపించుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌కు అనుమతి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇప్పుడు కూల్చివేసి డ్రామాలు చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీలో ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే 20 కోట్ల లీటర్ల మురుగు నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ. 4వేల కోట్లతో 31 ఎస్టీపీలకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ గుర్తుచేశారు. దక్షిణ ఆసియాలోనే వందకు వంద శాతం సీవరేజీ ట్రీట్మెంట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్‌ను మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు.
ఎస్టీపీల సందర్శనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎస్టీపీలనూ సందర్శిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్ నగరం నుంచి మురుగునీటిని శాశ్వతంగా విముక్తి చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ సంకల్పంతో కార్యక్రమాలు తీసుకున్నాం. హైదరాబాద్ నగరంలో రోజుకు 2వేల ఎంఎల్డీ మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి రూ. 772 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి జరిగేది. 1300 ఎంఎల్డీ సామర్థ్యం పెంచడంతో దక్షిణాసియాలోనే వందవాతం మురుగునీటి శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతున్నది అని కేటీఆర్ అన్నారు.
బలిసినోళ్లకు ఏం కాదని, పేదవాళ్లకే కష్టమని.. వారికి మానవీయ కోణంలో ఆలోచన చేసి.. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాకే తొలగింపులు చేపట్టాలని కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏమీ చేస్తున్నదో.. ఎడమ చేతికి తెలియడం లేదని, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మూడు రోజుల కిందట రిజిస్ట్రేషన్ చేసిన ఇండ్లను కూలగొడుతున్నారని, రూ.కోటిన్నర పెట్టి కొన్న ఇంటిని కూల్చేస్తే ఎవరు ఆ నష్టం భరిస్తారని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒక్కటే ఉండాలని, నోటీసులు ఇవ్వకుండా, తెల్లవారు జామున కూల్చేస్తున్నారని, ‘మీ దౌర్జన్యాలు, దాష్టీకాలు ఇలాగే కొనసాగితే.. మీ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. కోర్టు హాలిడే రోజు కావాలని ఉదయమే కూలగొడుతున్నారని, అభాగ్యులకు న్యాయం జరగకుండా చేస్తున్నారని, కోర్టులను, న్యాయ మూర్తులను కూడా అపహాస్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్ నగరం, ఇక్కడి ప్రజలపై సీఎం రేవంత్‌రెడ్డికి ప్రేమ లేదని, సమస్యలు తీర్చే తీరిక లేదని, పది నెలల్లో ఒక్క కొత్త కార్యక్రమం లేదని కేటీఆర్ అన్నారు. ఫతేనగర్ బ్రిడ్జి విస్తరణకు అప్పట్లోనే రూ. 100 కోట్లు కేటాయించామని, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ‘బడ్జెట్లో మాత్రం రూ. 10వేల కోట్లు అని బిల్డప్ ..కానీ పది నెలల్లో ఒక్క పైసా మంజూరు చేయలేదు’ అని అన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ ఇప్పుడు ఎంతో దారుణంగా మారిందో చూస్తుంటే బాధేస్తున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గంటల గంటలు జనం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నరు..లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది.
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలే ‘ఈ నగరానికి ఏమైందం’టూ కథనాలు రాశాయి’ అని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో పదేండ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతీయ, కుల విద్వేషాలకు అతీతంగా, మతం పేరుతో జరిగే దాడులకు ఆస్కారం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని గుర్తు చేశారు. ఫార్ములా ఈ-రేసు, నిమజ్జనం, మొహర్రం ఊరేగింపు, బోనాల పండుగలను శాంతియుతంగా నిర్వహించామన్నారు.
చివరకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు సజావుగా సాగేలా చేశామన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటే.. కనీసం నిర్వహించలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఎస్టీపీ నిర్మాణ పనుల్లో చాకచక్యంగా పనిచేసిన జలమండలి అధికారులు, కార్మికులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, వివేకానంద్, సబితా ఇంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శంభీపూర్ రాజు తదితరులు ఉన్నారు.