సిటీబ్యూరో/వెంగళ్రావునగర్, సెప్టెంబరు 28 (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మంత్రులంతా టూరిస్టులే అని, ఎన్నికలు అయిపోగానే వాళ్లంతా గాయబ్ అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టూరిస్టు మంత్రులు ఎవరూ హైదరాబాద్ జిల్లా వారు కాదని..ఎన్నికల తెల్లారి ఎవరూ ఇక్కడ ఉండరని..ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు.
అందుకే గతంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ను గెలిపించారని..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు విజయాన్ని చేకూర్చాలని ఆయన ప్రజల్ని కోరారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ షేక్‌పేట్ డివిజన్ సమతాకాలనీలో కేటీఆర్ పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు.
దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్‌ను కలవడానికి యువత భారీగా తరలివచ్చింది. ఇంటింటికీ బాకీ కార్డులు పంచిన కేటీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదురొంటున్న సమస్యలను స్థానికులు దృష్టికి తీసుకొచ్చారు.
ఇంటింటి పర్యటన సందర్భంగా కేటీఆర్ దృష్టికి పలువురు స్థానికులు సమస్యలపై ఏకరువు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదురొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ‘కేసీఆర్ ప్రభుత్వంలో పారిశుధ్య పనులు రోజూ జరిగేవి అయితే ఇప్పుడు నాలుగు రోజులు గడిచినా.. చెత్త తీసేవారే కరువయ్యారు..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి, ఇన్వర్టర్లు కొనుకుంటున్నాం’ అని పలువురు మహిళలు, పెద్దలు కేటీఆర్‌తో తమ బాధను వ్యక్తపరిచారు.
ప్రజల సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కాగా, కేటీఆర్ ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను స్థానికులకు అందజేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు ఉన్నారు.