సిటీ బ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తేతెలంగాణ): గులాబీ శ్రేణులు కష్టపడి పనిచేసి జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్రకు నాంది పలుకాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారెంటీల పేరిట అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు.
ఉప ఎన్నికలో ఆయన సతీమణి సునీతను గెలిపించడమే మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు మనమిచ్చే నివాళి అని అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో వెంగళరావునగర్ డివిజన్ బూత్ కమిటీ సమావేశం కార్పొరేటర్ దేదీప్యరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 23 నెలల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో కళకళలాడిన మహానగరం రేవంత్ పాలనలో కళ తప్పిందని నిప్పులు చెరిగారు. దోపిడీలు, దొంగతనాలకు అడ్డాగా మారిందని 41 శాతానికి పెరిగిన క్రైం రేటే ఇందుకు నిదర్శనమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్య మంత్రి, మంత్రులు మాత్రం మూటలు పంచుకోవడంలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. ‘రేవంత్ పాలనలో వీధి దీపాలు వెలగడం లేదు.. చెత్త ఎత్తే నాథుడు లేడు..రోడ్లపై గుంతలు పూడ్చే పరిస్థితిలేదు.. మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు..’ అంటూ తూర్పారబట్టారు. వరదల కారణంగా ముగ్గురు గల్లంతైనా సర్కారులో మాత్రం చలనం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
హస్తానికి ఓటేస్తే కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్టే..
కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి చెయ్యి గుర్తుకు ఓటేస్తే మన ఇండ్ల కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్టేనని, హైడ్రా బుల్డోజర్లను ఆహ్వానించినట్టేనని స్పష్టం చేశారు. ఇప్పుడు గల్లీలకు వచ్చి కల్ల బొల్లి కబుర్లు చెబుతున్న నాయకులు ఓట్లు డబ్బాలో పడగానే పత్తాలేకుండా పోతారని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే విలువలేదని, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల చెప్పే మాటలకు విలువేం ఉంటుందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. వారిచ్చే తాయిలాలకు ఆశపడితే మోసపోక తప్పదన్నారు. ఏనాటికైనా ఇంటి పార్టీనే శ్రీరామరక్ష అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.
నిత్యం ఏదో ఒక చోట నేరాలు..
కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన హైదరాబాద్ మహానగరం రేవంత్‌రెడ్డి పాలనలో అస్తవ్యస్తమైందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. నిత్యం ఏదో ఒకచోట నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చందానగర్‌లో పట్టపగలు జ్యువెల్లరీ షాపులో దోపిడీ జరిగిన తీరు చూస్తేనే శాంతిభద్రతల పరిస్థితి అర్ధమవుతున్నదని విమర్శించారు.
కనీసం సీసీ కెమెరాలు పనిచేయలేని దుస్థితి నెలకొన్నదని ధ్వజమెత్తారు. వీధుల్లోని స్తంభాలకు బల్బులు కూడా పెట్టడం లేదని ఆరోపించారు. భారీ వర్షాలకు ముగ్గురు మరణించినా చోద్యం చూడడం తప్పా.. చేసిందేమీలేదని విమర్శించారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి అన్నింటా విఫలమైన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పొరపాటున హస్తం పార్టీకి ఓటేస్తే నిండా మునగడం ఖాయమని హెచ్చరించారు.
ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్తరు..
ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులపట్ల ఆడబిడ్డలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘వాళ్లు ఆడబిడ్డల పెండ్లిళ్లకు తులం బంగారం ఇచ్చే వాళ్లు కాదు..మీ మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లే ఘనులు’ అంటూ చురకలంటించారు. మంత్రులు చెప్పే కల్లబొల్లి కబుర్లను నమ్మవద్దని సూచించారు. వాళ్లు ఎన్నికలు కాగానే పత్తాలేకుండా పోతారని ఎద్దేవా చేశారు. నిజంగా కాంగ్రెస్‌కు నగర ప్రజలపై ప్రేమ ఉంటే, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఫ్లైఓవర్లను నిర్మించాలని, ఎస్టీపీలను కట్టాలని డిమాండ్ చేశారు. అంతేగానీ ఓట్ల కోసం అభివృద్ధి పేరిట సాగిస్తున్న నాటకాలను కట్టిపెట్టాలన్నారు.
పంచాయితీలు పక్కనబెట్టి కష్టపడి పనిచేయండి..
వెంగళరావునగర్‌లోని 56 బూత్ కమిటీల సభ్యులు కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థి సునీత విజయానికి కృషి చేయాలని సూచించారు. సభ్యులు తమకు కేటాయించిన 25 ఇండ్లకు వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ హయాంలో అమలైన పథకాలను విడమరిచి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాను కండ్లకు కట్టినట్లు వివరించాలని నిర్దేశించారు.
ముఖ్యంగా హైడ్రా పేరిట సాగించిన విధ్వంసాన్ని వారికి తెలియజేయాలన్నారు. 23 నెలల్లో ఒక్క ఇల్లు అయినా కట్టని కాంగ్రెస్ సర్కారు వైఖరిని వివరించాలని పునరుద్ఘాటించారు. రెండు నెలలు వ్యక్తిగత పనులను వాయిదా వేసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేసి జూబ్లీహిల్స్ గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు.
మా ప్రభుత్వం వచ్చాక ఖబరస్థాన్‌కు స్థలం ఇస్తాం
వెంగళరావునగర్, సెప్టెంబర్ 15: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చాక ఖబరస్థాన్(ముస్లిం శ్మశానవాటిక)కు స్థలం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య నాయకత్వంలో వెంగళరావునగర్ డివిజన్లోని చిన్న మసీద్ అధ్యక్షుడు అబ్దుల్లా 50 మందితో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.