బీజెపీ, కాంగ్రెస్‌లు కలిసి మూసీకి, దామగుండం అడవికి ఉరి వేసే ప్రయత్నం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘మూసీ బాగు చేస్తామనేవాళ్లు మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లను తెలివి ఉన్నోడు కొట్టేస్తాడా.. భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వాళ్లు ఈ విధంగా చేస్తారా’.. అని అన్నారు. నది పుట్టిన కాడా చంపేసి.. మూసీ సుందరీకరణ చేస్తామనడం అంటే కమీషన్ల కోసమేనన్నారు. ఆదివారం సభ్యత్వ నమోదు, సర్‌పై వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైపోయిందన్నారు. కాంగ్రెస్‌కు పరిపాలన చేతనైతలేదని విమర్శించారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చుడు పక్కా అని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కా అని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్, జూన్ 28, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో మెజార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను పూర్తిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందులో భాగంగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తిచేశామని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తే ప్రజలు కేసీఆర్‌ను గుర్తుంచుకుంటారని ఒకే ఒక్క ఈర్ష్యతో ఎత్తిపోతల ప్రాజెక్టును పక్కన పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సర్‌పై వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తలకు ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నీచ రాజకీయాల వల్ల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగానికి సాగునీరందడం లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో యూరియా ఎట్ల దొరికింది, కాంగ్రెస్ రావడంతోనే యూరియా కోసం లైన్లు ఎందుకు కడుతున్నారో, ఎందుకు దొరుకతలేదో దమ్ముంటే సమాధానం చెప్పాలన్నారు.
రైతుల భూములను లాక్కుంటున్న సర్కార్: సబితారెడ్డి
పరిగిలోని 20 గ్రామాల రైతుల పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను మాజీ సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. వికారాబాద్ జిల్లాపై కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని, వికారాబాద్ ప్రాంత ప్రజలు, రైతులకు అవసరమైన కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించేవారన్నారు. కేసీఆర్‌ను మళ్లి వెనక్కి తెచ్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి సర్‌పై అవగాహన కల్పించాలని సబితారెడ్డి కోరారు.
కాంగ్రెస్ పాలనలో ఆగమైన ప్రజలు: ఆర్ఎస్పీ
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆగమైపోయారని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పోడిచాయని విమర్శించారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఫారాలను బీఎల్వోలకు అందజేసి రసీదును పొందాలన్నారు. 2002లో ఓటరు ముసాయిదా ఆధారంగా వారి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గట్టు రాంచంద్రారావు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్‌పటేల్, పంజగుల శ్రీశైల్ రెడ్డి, రాజు గౌడ్, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు గోపాల్, బీఆర్ఎస్ నాయకులుపాల్గొన్నారు.