వెంగళరావునగర్, మే 10: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండాగిరికి పాల్పడ్డారు.. ఓర్వలేక, ఓటమి భయంతో దాడులకు తెగబడ్డారు.. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌ను దూషిస్తూ, ఆమె కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం జవహర్‌నగర్‌లో జరిగింది. బాధితురాలైన వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సివరేజ్ సమస్యపై ఫిర్యాదు రావడంతో జవహర్‌నగర్‌కు కార్పొరేటర్ దేదీప్య విజయ్ బయలుదేరారు. మార్గ మధ్యలో మసీదు గడ్డలోని చోటీ మసీదు వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవ పడసాగారు. ఆ సమయంలో ఆటుగా వెళ్తున్న దేదీప్య విజయ్ వారిని గమనించి కారును ఆపారు. కార్పొరేటర్‌ను పరుష పదజాలంతో కాంగ్రెస్ కార్యకర్తలు దూషించారు. అక్కడ పార్క్ చేసిన ఆమె కారు అద్దాలను పగులగొట్టారు. ఓర్వలేక, ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడుతున్నారని కార్పొరేటర్ అన్నారు. యూసుఫ్‌గూడ ప్రాంతం నుంచి వచ్చిన అజ్జు, ఖాలిద్, మనోజ్, ఆదిల్.. మరికొంత మంది కాంగ్రెస్ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ గుండాగిరికి భయపడేదే లేదని, తమ పార్టీకి ఉన్న జనాధరణను చూసి అసూయతో దుష్ట కాంగ్రెస్ దాడి చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. కాగా, అనుమతి లేకుండా ప్రచారం చేసిన ఇరు పార్టీలపై కేసు నమోదు చేయడంతో పాటు కార్పొరేటర్ కారు అద్దాలు ధ్వంసం చేసిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు మధురానగర్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.