గ్రేటర్ హైదరాబాద్‌లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ సభకు దండులా కదిలిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 27 న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహా సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మహాసభకు లక్షలాదిగా తరలిరావాలన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ సాధించిన విజయాలు అసమాన్యం, అనితరసాధ్యమైనవన్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదని చెప్పారు. హైదరాబాద్ ప్రజల ముందు కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు, దొంగనాటకాలు పనిచేయలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ముఠాగోపాల్, సుధీర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభివాణీదేవి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
– సిటీ బ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ)