శనివారం యువ సంగ్రామ సభ నేపథ్యంలో సరూర్‌నగర్ పరిసరాలు గులాబీమయంగా మారాయి. స్టేడియం పరిసరాలు ఫ్లెక్సీలు.. గులాబీ తోరణాలతో కళకళలాడుతున్నాయి. నిరుద్యోగులు భారీగా తరలివస్తుండటంతో ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
యువ సంగ్రామ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. సభకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం , పోలీస్‌లు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు హైకోర్టు అనుమతితో తొలగిపోయా యన్నారు. నిరుద్యోగుల శాంతియుత పోరాటాలకు కూడా ప్రభుత్వం అడ్డుతగులుతోందని విమర్శించారు. సభ అనుమతులకు ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ.. గత ఎన్నికల్లో సరూర్‌నగర్ స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించింది కాంగ్రెస్. తీరా ‘ప్రజాపాలన’ కొలువుదీరాక రెండున్నరేండ్లుగా యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా..మోసం చేస్తున్నది. ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ..నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా.. పట్టించుకోవడం లేదు. నిరసన తెలుపుతున్న వారిపట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నది. నిరుద్యోగ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన అదే సరూర్‌నగర్ స్టేడియంలో అదే వేదిక ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు ‘యువ సంగ్రామ సదస్సు’ పేరిట నిరుద్యోగుల గొంతుకగా నిలిచేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. నేడు జరిగే ఈ సభకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభా ప్రాంగణం..పరిసరాలన్నీ గులాబీమయంగా మారాయి. సభకు వచ్చేవారికి వర్షం వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఐదెకరాల స్థలంలో పార్కింగ్ సౌకర్యం, మొబైల్ టాయిలెట్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. కాగా, సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు స్పష్టించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎన్ని అడ్డంకులు కలిగించినా.. వాటిని ఎదుర్కొని సభ విజయవంతం చేసేందుకు గులాబీ దళం సిద్ధమైంది.
– ఎల్బీనగర్, జూలై 17
నిరుద్యోగుల సమస్యలను కాంగ్రెస్ సర్కార్ దృష్టికి తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న యువ సంగ్రామ సభకు ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ముస్తాబైనది. సభకు అనుమతించాలంటూ కోరినప్పటికీ పోలీసులు, అధికారులు శుక్రవారం వరకు కూడా అనుమతి ఇవ్వకుండా
సభ జరగకుండా చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే రీతిలో సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువ సంగ్రామ సభకు రానుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు, యువ, విద్యార్థి నాయకులు సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు చేసుకుని సిద్ధమయ్యారు.
– ఎల్బీనగర్, జూలై 17 :
రహదారులు గులాబీమయం.. యువ సంగ్రామ సభ నేపథ్యంలో సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియం ప్రాంగణంతో పాటుగా స్టేడియం వెలుపల జాతీయ రహదారిపై దిల్సుఖ్నగర్ మొదలుకుని ఎల్బీనగర్ ప్రాంతం వరకు ఇరువైపులా ఫ్లెక్సీలతో గులాబీ మయంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటం చేస్తున్న నిరుద్యోగ యువతతో పాటుగా పలువురు విద్యార్థులు భారీగా సభకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో సరూర్‌నగర్ స్టేడియంలోనే సమావేశం పెట్టించి యువతకు భరోసా ఇస్తూ అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించారు. కాగా ఇప్పటి వరకు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ యువ సంగ్రామ సభను నిర్వహిస్తోంది. సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ,పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నివాసంలో ఇటీవల సమావేశం నిర్వహించారు.
సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి , మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. రెండు రోజులుగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సభ ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, ఎర్రోళ్ల శ్రీనివాస్ పలువురు నాయకులు ఏర్పాట్లు పరిశీలించారు.

సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియం ప్రాంగణంలో శనివారం నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తరలివచ్చే విద్యార్థులు, యువతకు ఎండకు, వానకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికతో పాటుగా ముందు యువత, విద్యార్థులు కూడా కూర్చునేందుకు వాటర్ ప్రూప్ టెంట్లను వేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ ప్రాంగణానికి వచ్చే దారితో పాటుగా యువతతో విద్యార్థుల వద్దకు నేరుగా వెళ్లి మాట్లాడే విధంగా ర్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఇరువైపులా యువత కూర్చునే ఏర్పాట్లు చేస్తూ వేదిక మధ్య నుంచి నేరుగా ర్యాంపుపై నుంచి నడుస్తూ ముందుకు వెళ్లేలా చేస్తున్నారు. స్టేడియం పక్కనే ఉన్న ఐదెకరాల ప్రైవేటు స్థలంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక సభా ప్రాంగణంలో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు.
సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. నిరుద్యోగ యువతలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో సభకు అనుమతి ఇవ్వకుండా చేసేందుకు విఫలయత్నం చేస్తోంది. సభ కోసం రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా డీఎస్‌డీవోకు అనుమతి కోసం పద్దెనిమిది రోజుల క్రితమే కోరగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుందని, అనుమతి కోరాలని చెప్పడంతో దరఖాస్తు చేశారు.
కాగా అధికారులు రెండు రోజులకో కొర్రీ పెడుతూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేశారు. పార్కింగ్ అంటూ ఒకసారి, ట్రాఫిక్ చిక్కులు అంటూ, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలంటూ, సీసీ కెమెరాల నిఘా పెట్టాలంటూ ఇబ్బందులకు గురి చేశారు. పోలీస్ అధికారులు మధ్యాహ్నం వరకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లి సభను నిర్వహించి తీరుతామని చెప్పారు.
శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నుంచి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి మాట్లాడిన సీపీ తన వద్దకు ఫైల్ ఇప్పుడే వచ్చిందని పరిశీలించి చూస్తామని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రానికి ఎట్టకేలకు హైకోర్టు సభకు అనుమతించింది.

కాప్రా, జూలై 17: కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విమర్శించారు. శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేసేందుకు ఏఎస్‌రావునగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తమ హక్కుల సాధన కోసం యువత పెద్ద సంఖ్యలో యువ సంగ్రామ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత ఒక్కటై తమ గొంతును వినిపించే వేదికగా సరూర్‌నగర్ యూత్ డిక్లరేషన్ సభ నిలువనుందన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు,యువత,విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేయాలనని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి, జూలై 17: యువ సం గ్రామ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎంఎస్ కన్వెన్షన్‌లో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ శనివారం నిర్వహించనున్న యువ సంగ్రామ సభ నిరుద్యోగ యువత సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై నిర్వహిస్తున్న ముఖ్యమైన కార్యక్రమమని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గచ్చిబౌలి మాజీ వార్డు సభ్యుడు రాగం జంగయ్య యాదవ్, నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు రాగం హరి శంకర్ యాదవ్, నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు ముదిరాజ్, భిక్షపతి పాల్గొన్నారు.

ఎల్బీనగర్, జూలై 17: యువ సంగ్రామ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. శుక్రవారం సరూర్‌నగర్ స్టేడియం సభా ప్రాంగణం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్యాదరి బాలమల్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి వారు మాట్లాడారు. సభకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం , పోలీస్ యంత్రాలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు హైకోర్టు అనుమతితో తొలగిపోయాయన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఆగ్రహంతో ఉన్నారన్న నెపంతో వారి శాంతియుత పోరాటాలకు కూడా అడ్డుతగులుతోందని విమర్శించారు.
సభ అనుమతులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మొదలుకుని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డీఎస్‌డీవోకు లేఖలు ఇచ్చామని, అయితే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ పరిధిలోకి వస్తున్నందున కమిషనర్‌కు నేరుగా అనుమతి కోసం లేఖ ఇవ్వాలని కోరగా అక్కడ కూడా ఇచ్చి 18 రోజులు గడిచినా రోజుకో కొర్రీ పెడుతూ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా యువత, నిరుద్యోగులు తరలివస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం తెలుసుకుని అనుమతులు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు అనుమతి ఇవ్వకున్నా హైకోర్టు అనుమతితో సభను నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు. శుక్రవారం కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో గురువారం నిరుద్యోగ జేఏసీ నాయకులు తమ హక్కులను కేబినెట్ సమావేశం దృష్టికి తెచ్చేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో శాంతియుత ర్యాలీ చేస్తుంటే వారిపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జి చేసి వాహనాల్లో పడేసి నాగోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు. సభకు అనుమతి ఇచ్చేందుకు సీఎం భయపడుతున్నారని, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉన్నందున కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతారని భయపడుతున్నారని అన్నారు.
నిరుద్యోగ యువత విషయంలో పిచ్చి చేష్టలు చేస్తే యువత తిరగబడుతుందని వారు హెచ్చరించారు. ఉద్యోగం కోసం అడిగిన యువతను పురుగుల మందు తాగాలని చెప్పిన సీఎం రేవంత్ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ విద్యార్థులు వస్తారన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 16న ఉన్న పరీక్షను సభ ఉన్న జూలై 18వ తేదీకి వాయిదా వేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీతో సెంట్రల్ లైబ్రరీ వద్ద, ప్రియాంక గాంధీతో ఇదే సరూర్‌నగర్ మైదానంలో అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటించి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందన్నారు.

సీఎంతో పాటుగా హోం మంత్రి రేవంత్‌రెడ్డి కావడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు.యువ సంగ్రామ సభ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో సంవిధాన్ బచావో అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని వెళ్తున్నారని, అయితే అదే పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంవిధాన్ హఠావో అన్నట్లుగా పనిచేస్తున్నారని అన్నారు.
రాజ్యాంగాన్ని పట్టుకుని హక్కులను కాపాడుతానని రాహుల్‌గాంధీ తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా రాజ్యాంగం చదివారా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 19, క్లాజ్ 1, సబ్ క్లాజ్ ఏ ఏమి చెబుతుందంటే ఈ దేశంలో ఏ పౌరుడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, పక్కవారికి ఇబ్బంది కలుగనంత వరకు అని, సబ్‌క్లాజ్ బీ దేశంలోని ఎక్కడైనా ఆయుధాలు పట్టుకోకుండా సభకు ఎక్కడైనా పెట్టుకోవచ్చని చెబుతున్నదని అన్నారు. తాము సభ కోసం అనుమతుల కోసం అడిగితే ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలని కేటీఆర్ ఆదేశాల మేరకు సరూర్‌నగర్ స్టేడియంలో సమావేశం పెడుతున్నామన్నారు. అన్ని విధాలుగా అనుమతులు కోరితే ఎందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదో రేవంత్‌రెడ్డి చెప్పాలని అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడే భాషతో ప్రజలు కోపోద్రిక్తులు అవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో గ్యాదరి బాలమల్లు, రాకేశ్, కిశోర్ గౌడ్, పాండు గౌడ్, రాంనర్సింహగౌడ్, రాఘవేంద్ర, ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, రమేశ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, పార్శపు శ్రీధర్, భాస్కర్ గంగపుత్ర, సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.