నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ వేటలో అలసిపోయి టీ కొట్టు పెట్టుకున్న నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ అస్పిరెంట్ అడ్డా టీ షాపును సందర్శించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నిరుద్యోగ యువత సాదకబాధకాలను తెలుసుకున్నారు. వారితో కలసి టీ తాగుతూ వారి పోరాటంలో భాగం అవుతామన్నారు.
– ఎల్బీనగర్, మే 16
కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు కట్టిపెట్టి ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతను కాపాడాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసి ఇచ్చిన హామీలు, సరూర్‌నగర్ స్టేడి యం కేంద్రంగా యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జాబ్ క్యాలండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు రూ. 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డులను అందిస్తామని, యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు పెంచుతామని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ సమయానికి విడుదల చేస్తామని ఇచ్చిన హామీలతో యువత ఊరు వాడా తిరిగి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారన్నారు.
తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన హామీలకు మూడేళ్లు దాటినా పట్టించుకోకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల ఊసే లేకుండా నిరుద్యోగులను నిరాశలోకి నెట్టడంతో బంగారు భవిష్యత్తుపై కలలుగన్న యువత ఉపాధి లేక చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే దుస్థితి దాపురించిందన్నారు.
పోలీస్ ఉద్యోగాల్లో , టీచర్ ఉద్యోగాల్లో వెలిగిపోవాల్సిన నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరి పరిస్థితిల్లో టీ కొట్టు నడుపుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 29,46లను రద్దు చేయాలని, గ్రూపు 1 నియామకాల్లో చోటు చేసుకున్న అనుమానాలపై సిట్ ద్వారా పారదర్శక విచారణ చేయాలని కోరారు. నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కుమార్, ఐలేని నర్సింహారావు, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, శంకర్ నాయక్, భూక్యకుమార్, షింబూ నాయక్, నవీన్ పట్నాయక్, సింధూరెడ్డి, ఆకాశ్, అంజలి, శ్రీదేవి, అశోక్, నందు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.