ఖైరతాబాద్ : జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో గత రెండు నెలలుగా తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి రోజుకు 750 ఎంజీడీల నీటి అవసరం ఉండగా కేవలం 550 ఎంజీడీలే సరఫరా చేస్తున్నారని తెలిపారు. మరోవైపు రోజుకు 12 వేల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండడం చూస్తే పైప్లైన్ ద్వారా సరైన నీటి సరఫరా జరగడం లేదనే విషయం స్పష్టమవుతోందని అన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.