హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌పై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిపెట్టింది. గురువారం తెలంగాణ భవన్లో కౌంటింగ్ ఏజెంట్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఉదయం 6 గంటలకల్లా కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్‌పార్టీ.. కౌంటింగ్‌లోనూ అదేపద్ధతిని అవలంభించే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ ఏజెంట్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఓట్ల లెక్కింపును క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అన్నారు. లెక్కింపు పూర్తయ్యేదాకా కౌంటింగ్ సెంటర్ల నుంచి బయటకు రావొద్దని చెప్పారు. ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్ల స్లిప్పులతో సరిచూసుకోవాలని, ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే సంబంధిత ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అవసరమైతే రీకౌంటింగ్ కోరాలని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతామధు పాల్గొన్నారు.