సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ) ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పరిమితమై.. పాలనను గాలికి వదిలేసిందని, సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలపై దృష్టి పెట్టి ప్రజల కనీస అవసరాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి ఆరోపించారు. . కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో ప్రజలకు కనీస సౌకర్యాలు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం మొద్దునిద్ర పోతుందన్నారు.
వర్షాకాలం రాకముందే వరద నీటి వ్యవస్థకు మరమ్మతులు చేపట్టాలన్న సోయి కూడా లేకుండా సరారు అలసత్వం వహించిందని చెప్పారు. చిన్న పాటి వర్షాలకే నగరంలోని రోడ్లు, ఫ్లెఓవర్లు చెరువుల్ని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. హడావుడిగా మేలొన్న ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన, వరద నీటి నిర్వహణకు పరిషారాలు అంటూ సమీక్షల పేరుతో మభ్యపెడుతోందని విమర్శించారు. వర్షాలు వచ్చిన తర్వాత టైమ్ పాస్ సమీక్షలు పెడితే ఉపయోగమేంటి. మే, జూన్ నెలల్లో చేయాల్సిన పనులను ఆగస్టులో చేపట్టడం రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని సతీష్‌రెడ్డి మండిపడ్డారు.
నిర్వహణ చేతకాక…ఫ్లై ఓవర్‌కు డ్రిల్లింగ్ చేయడమా: సతీష్‌రావు
కాంగ్రెస్ పాలనలో నగరజీవనం నరకప్రాయంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆరోపించారు. గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే వరద కష్టాలు అధికమయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలపై హైడ్రా పెత్తనం చెలాయిస్తుందని, ఈ ప్రభావం సహాయక చర్యలపై పడుతుందని పేర్కొన్నారు. హైడ్రా, వాతావరణ శాఖల మధ్య సఖ్యత లేకపోవడంతో రెయిన్ అలర్ట్ ప్రజలను మరింత గందరగోళానికి నెట్టేస్తున్నాయని సతీష్‌రావు అన్నారు.
వర్షం పడితే చాలు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నారని, కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్న పట్టడం లేదన్నారు. కృష్ణానగర్, ఆమీర్‌పేట బస్తీలు మునగడానికి హైడ్రానే కారణమన్నారు. సైబర్ సిటీలో ట్రాఫిక్ వాహనదారుల వెన్నులో వణుకుపుట్టిస్తుందన్నారు. ఒక్క కూడలి వద్ద హైడ్రా, పోలీస్ సిబ్బంది ఉండడం లేదని, గంటల కొద్దీ ట్రాఫిక్‌లో వాహనదారులు నరకయాతనను అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ ఫ్లై ఓవర్ నిర్వహణ లోపంతోనే వర్షపు నీరు నిలిచిపోయిందని, కొండ నాలుకకు సమస్య వస్తే ఉన్న నాలుకను ఊడగొట్టడం అన్న చందంగా ప్రభుత్వం ఫ్లెఓవర్కు డ్రిల్లింగ్ చేసి, నీరు తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. డ్రెయిన్స్‌లో నీళ్లు తొలగించడానికి వర్షాలు పడుతున్న సమయంలో హైడ్రా విభాగా డీవాటరింగ్ పంపులకు టెండర్లు పిలిచారంటే పాలనకు అద్దం పడుతుందని సతీష్‌రావు ఎద్దేవా చేశారు.