KTR | మన్సూరాబాద్, అక్టోబర్ 19: మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లను దోచుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి పథకం వేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇండ్లు పోతాయని ఆందోళన చెందవద్దని, వారి ఇండ్లను రక్షించేందుకు అడ్వకేట్లను నియమించామని.. ఇప్పటికే 500 మంది ఇండ్లకు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల తమ ఇండ్లకు సంబంధించిన దస్తావేజులను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి అందజేస్తే త్వరలో వారికి ఇండ్ల సంరక్షణ కోసం కోర్టు నుంచి స్టే తీసుకువస్తామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్, మల్లికార్జునహిల్స్లో రూ. 400 కోట్లతో నూతనంగా నిర్మించిన 320 ఎంఎల్డీ ఎస్టీపీ ప్లాంటును శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు.
రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఎస్టీపీ వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేటీఆర్ తెలిపారు. శుద్ధి కాకముందు.. శుద్ధి అయిన తరువాత ఉన్న నీటిని ప్రజలకు చూపించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఎస్టీపీ వల్ల జరిగే మేలును ప్రజలకు వివరించారు.మంచిరేవుల నుంచి నాగోల్ దిగువ వరకు రూ. 3866 కోట్లతో నిర్మిస్తున్న ఎస్టీపీలతో మూసీ ప్రక్షాళన జరుగుతుందని.. ఇప్పుడు కొత్తగా రేవంత్‌రెడ్డి వచ్చి చేసేది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు.
నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పాలి
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్
మూసీని శుద్ధీ చేసే ప్రక్రియ బీఆర్ఎస్ సర్కారు హయాంలో మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ప్రారంభమైందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో మూసీ సుందరీకరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగానే పలు ప్రాంతాల్లో ఎస్టీపీలను నిర్మించామన్నారు. ఎస్టీపీల్లో శుద్ధి అయిన నీరు దిగువకు పోవడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు.
మూసీ ప్రక్షాళన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల కుటుంబాలను రోడ్ల పాలు చేస్తున్నారన్నారు. బఫర్‌జోన్ పేరుతో ఇండ్లను కూలిస్తే మూసీ పరీవాహక ప్రాంతంలో సుమారు 13 నుంచి 14 వేల కుటుంబాల్లోని సుమారు లక్ష మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉందన్నారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు నష్ట పరిహారం ఎంత చెల్లిస్తారో ముందు తెలియజేయాలన్నారు.
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కట్టుకున్న ఇండ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేపీ వివేకానంద్‌గౌడ్, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.