హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నగరంలో రెండు నెలల తర్వాత వచ్చే మున్సిపల్/ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని, బీఆర్ఎస్ పార్టీ పవర్ చూపిస్తామని ఆ పార్టీ కార్యకర్తలు శపథం చేశారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు మరింతగా కష్టపడి, వ్యూహాత్మకంగా పార్టీని గెలిపించుకుంటామని, దానికి భరోసా పార్టీ అగ్రనాయకత్వం నుంచి లభిస్తుందని వారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేంత వరకు కష్టపడి పని చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే, ఈ సారి కచ్చితంగా 9 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని వారు అభిప్రాయపడ్డారు. తామంతా కేసీఆర్‌కు ఏకలవ్య శిష్యులమని ఈ సమావేశంలో పాల్గొన్న ఒక కార్యకర్తలు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అరాచకాలు ఎన్నో…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ వాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసుల సహకారంతో విచ్చల విడిగా డబ్బులు పంచారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని వారు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్దే కాంగ్రెస్ నాయకులు డబ్బు పంపిణీ చేశారని ఆరోపించారు.
ఇందుకు పోలీసుల సహకారం, అండదండులు కూడా వారికి పుష్కలంగా లభించడం బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు రావడానికి కారణమైందని ఆ పార్టీ శ్రేణులు చెపారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రె స్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని, దీంతో పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ల నుంచి తమకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, ఈ విషయంలో బీఆర్ఎస్ అగ్రనాయకులు తమకు అండగా ఉండాలని వారు కోరారు. ఉపఎన్నికలో బోగస్ ఓట్లు బాగా నమోదయ్యాయని, దానిని అడ్డుకునే ప్రయత్నంలో కొంత వరకు సఫలీకృతమయ్యామని తెలిపారు. కొందరు కార్యకర్తలపై బలవంతంగా కాంగ్రెస్ జెండా కప్పారని మండిపడ్డారు.
సీఎంకు ముచ్చెమటలు పట్టించాం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ముచ్చెమటలు పట్టించిందని, దాని ప్రభావం వల్లే మైనారిటీ కోటాలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని బీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల పాటు జూబ్లీహిల్స్ గల్లీల్లో తిరుగుతూ ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. ఒక అడబిడ్డను ఓడించడం కోసం మంత్రులు ఈ నియోజకవర్గంలోనే తిష్ట వేశారని, అయినా బీఆర్ఎస్కు 75 వేల ఓట్లు వచ్చేలా తాము కృషి చేశామన్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని మెజారిటీతో గెలిపించుకుంటామని కార్యకర్తలు ముక్తకంఠంతో కేటీఆర్ సమక్షంలో భరోసా ఇచ్చారు.