గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన అశాస్త్రీయ విభజనకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రూపుమాపే కుట్రలను ఎలుగెత్తి చూపుతూ.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన ర్యాలీలో సికింద్రాబాద్‌కు చెందిన అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం వందలాది మంది పోలీసు బలగాలను మోహరించింది. వేలాదిగా కదిలివచ్చిన ప్రజానికాన్ని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లో ఇష్టారీతిన పడేశారు. మహిళలను సైతం మహిళా పోలీసు బలగాలు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసి స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ సర్కారు సాగించిన ఈ ‘నిర్బంధ కాండ’పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

సిటీబ్యూరో, బేగంపేట/ సికింద్రాబాద్ / చిక్కడపల్లి, జనవరి 17: సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని సికింద్రాబాద్ ప్రజలు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడే నిర్బంధించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. సికింద్రాబాద్ ప్రధాన ప్రాంతాలైన అల్ఫాహోటల్, ప్యాట్నీ, ప్యారడైజ్, మోండా మార్కెట్‌తో పాటు ఎంజీ రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, రాణిగంజ్ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ నల్లదుస్తులు ధరించి, నల్ల బెలూన్ల ఎగరేస్తూ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
ఆయనను వెంటనే పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్కుమార్గౌడ్తో పాటు సుమారు 500 మంది లష్కర్ ప్రాంతపు ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సికింద్రాబాద్ అల్ఫా హోటల్ నుంచి భారీ ర్యాలీగా నల్లబ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి నినాదాలు చేస్తూ ఎంజీ రోడ్డు వరకు తరలి వచ్చారు. అదేవిధంగా బేగంపేట డివిజన్ నుంచి కార్పొరేటర్ మహేశ్వరి నేతృత్వంలో, కంటోన్మెంట్ నుంచి మహేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్ హేమ, బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు వచ్చి బైఠాయించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి చేస్తున్న నిర్బంధ కాండను ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
బలవంతంగా ఈడ్చుకెళ్లి..
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి ఈడ్చేశారు. బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ జులూం నశించాలి.. పోలీసులు డౌన్‌డౌన్.. అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు మహిళా కార్పొరేటర్లను, బీఆర్ఎస్ నాయకురాళ్లను బలవంతంగా తోసివేస్తూ ఈడ్చుకెళ్లారు. అనంతరం గాంధీ విగ్రహం చుట్టూ పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. లక్ష్యం సాధించే వరకు పోరాటం ఆపేదే లేదని గుర్రం పవన్‌కుమార్‌గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాంతి ర్యాలీకి మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్న నాయకులు తలసాని స్కైలాబ్యాదవ్, శ్రీహరి, నాగులు, మహేశ్‌యాదవ్, మహేశ్వర్‌రెడ్డి, పాండుయాదవ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. అయినా పోలీసులు దౌర్జన్యంగా వారిని స్టేషన్లకు తరలించారు.
అక్రమ అరెస్టులు
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను పోలీసులు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఎంజీ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ హేమ, నాయకులను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్పొరేటర్ హేమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా.. అక్రమ అరెస్టులకు బయటపడేది లేదని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
కాగా, సీతాఫల్మండి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల ప్రకాశ్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.నోముల ప్రకాశ్ నేతృత్వంలో సాగుతున్న ర్యాలీని చిలకలగూడ పోలీసులు అడ్డుకొని.. అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే బీఆర్ఎస్ యువ నేత ముఠా జయసింహతోపాటు పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట్‌కు తరలించారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సంఘీభావం తెలిపారు.

నియంతృత్వ పాలనకు పరాకాష్ట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నియంతృత్వ పాలనకు పరాకాష్టగా ఉందని సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి,బీఆర్ఎస్ యువనేత తలసాని సాయికిరణ్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పినా.. అక్రమంగా అరెస్ట్‌లు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నట్టుగా వేలాది మంది పోలీసులు వచ్చి ర్యాలీని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం.
హైదరాబాద్, సికింద్రాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా జంటనగరాలుగా గర్తింపు ఉన్నది. అలాంటి జంట నగరాలను విడదీసి ఈ ప్రాంతానికి సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేశారు. సికింద్రాబాద్ చరిత్రను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అస్తిత్వం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్ట్‌లు చేయడం దుర్మార్గం. ఈనెల 5న ర్యాలీకి అనుమతి కోరినా ఉద్దేశ పూర్వకంగా శుక్రవారం రాత్రి అనుమతిని తిరస్కరించారు. అరెస్ట్‌లు, అడ్డంకుల వల్ల మా ఉద్యమం ఆగదని సాయికిరణ్ తెలిపారు.. ప్రజల మద్దతు, రెట్టింపు ఉత్సాహంతో త్వరలోనే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని సాయికిరణ్ స్పష్టం చేశారు.
లక్ష్యం సాధించేవరకు పోరాటం..
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదాకా మా పోరాటాన్ని ఆపబోమని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుకు ముందు నుంచే సికింద్రాబాద్‌ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలనే డిమాండ్ ఉంది. దీనికి ఈ ప్రాంత ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రాంత చరిత్ర, అస్తిత్వం కనుమరుగు కావొద్దంటే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుతోనే సాధ్యం. అక్రమ అరెస్టులతో మమ్మల్ని ఆపలేరు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అనుమతులు తెచ్చుకుని భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. తమ లక్ష్యం సాధించేవరకు విశ్రమించేది లేదని తెలిపారు.
ఉనికిని చాటేందుకు ఉద్యమిస్తాం
జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ ప్రాముఖ్యతను కనుమరుగు చేసేలా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం విడ్డూరం. సికింద్రాబాద్ ఉనికిని చాటుకొనేందుకు ఉద్యమిస్తాం. ర్యాలీకి అనుమతించకుండా మా పార్టీ నేతలు, కార్పొరేటర్లు,నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం, అరెస్టులు చేయడం దారుణం. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేస్తే తీవ్రంగా స్పందిస్తామని పద్మారావుగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చిరించారు.
శాంతి ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గం
శాంతియుతంగా నిరసన తెలుపడానికి బయలుదేరితే పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే అవకాశం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. చారిత్రక నేపథ్యమున్న సికింద్రాబాద్‌ను కనుమరుగు చేయడంలో భాగంగా మల్కాజిగిరిని తెరపైకి తీసుకువస్తున్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం చేపట్టిన శాంతియుత పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారు. శాంతి ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసుల అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముఠాగోపాల్ అన్నారు. త్వరలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం.