కరెంటు మంటలు.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నాయి. మూడు పూటలా అన్నం పెట్టే రైతుకు మూడు గంటలే కరెంట్ ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కర్షకలోకం భగ్గుమంటున్నది. రైతుల జోలికి వస్తే రేవంత్‌రెడ్డిని ఊరి పొలిమేరల వరకు తరిమికొడతామని గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు రెండో రోజూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చుకుం టాం.. మీకెందుకు కడుపు మంట? కండ్ల మంట? అంటూ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి, దహనం చేశారు. విద్యుత్ సౌధ ఎదుట జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ నేతలు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి, యూసుఫ్‌గూడలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్‌పేట ఛేనంబర్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే కృష్ణారావు, ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్, రాంనగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కంటోన్మెంట్లో కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, దహనం చేశారు.
– సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ)
రైతులకు 3 గంటల పాటు విద్యుత్ ఇస్తే సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. నగర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి, చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదికి మూడు పంటలు పండించుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇస్తూ.. రైతు రాజ్యం తీసుకురావాలని తాపత్రాయ పడుతుంటే.. రేవంత్ రెడ్డి అందుకు
విరుద్ధంగా అన్నం పెట్టే రైతన్నల పొట్ట కొట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రైతన్నలను అణగదొక్కాలని చూస్తే పాతాళంలో తొక్కుతామని హెచ్చరించారు. రాష్ర్టాన్ని తిరిగి అంధకారంలోకి నెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదని
ఆరోపించారు. బేషరతుగా రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పకపోతే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా తన పిచ్చి ప్రేలాపనాలు మానుకోవాలని హెచ్చరించారు. రైతును రాజు చేసే కేసీఆర్ కావాలో, రైతును నట్టేట ముంచే కాంగ్రెస్ కావాలో ప్రజలకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు.