BRS | ఘట్కేసర్, మే 20: పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులను వెంటాడి, భయబ్రాంతులకు గురిచేసి..కిడ్నాప్‌నకు యత్నించిన వ్యక్తులను గుర్తించి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పీర్జాదిగూడ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్‌రెడ్డి సోమవారం ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదివారం మేయర్ వెంకట్‌రెడ్డి, మరికొందరు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు సూర్యాపేట నుంచి శంషాబాద్‌లోని నోవా హోటల్‌కు వెళ్తున్న క్రమంలో ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అమర్‌సింగ్, టి. శ్రీధర్‌రెడ్డి, బి. నవీన్‌రెడ్డి, ఎం.చంద్రారెడ్డి, సీహెచ్. జగదీశ్వర్‌రెడ్డి, పి.అంజిరెడ్డి, కుర్ర శివకుమార్‌గౌడ్, సీహెచ్.నర్సింహరెడ్డి మరికొందరు దాదాపు పది కార్లలో వెంబడించి.. భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులను వెంబడించి భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తుల్లో పీర్జాదిగూడ చెందిన కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి బీఆర్ఎస్ నాయకులను అపహరించేందుకు ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును పరిశీలించి.. చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపారు.