సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యుద్ధభేరి మోగించింది. ప్రయాణికుల పక్షాన గొంతెత్తింది. సామాన్యులపై భారం మోపేలా పెంచిన బస్ టికెట్ చార్జీలను తక్షణమే తగ్గించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ‘చలో బస్ భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గ్రేటర్ వ్యాప్తంగా గులాబీ దండు కదలిరానున్నది. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా బస్సులో ప్రయాణం చేస్తూ నగర నలుమూలల నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌కు చేరుకుంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టాప్ నుంచి బస్‌లో ప్రయాణం చేస్తూ బస్ భవన్‌కు చేరుకోనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఉదయం 8:45 గంటలకు బస్సులో మెహిదీపట్నం బస్టాప్ నుంచి బస్ భవన్‌కు చేరుకోనున్నారు.
ఇదే క్రమంలో రేతిఫైల్ నుంచి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ కూడా బస్సులో ప్రయాణం చేయనున్నారు. కాగా, ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యే ముఠాగోపాల్, కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు బస్ భవన్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో వారి కష్టాల గురించి అడిగి తెలుసుకుంటారు. బస్సు చార్జీలను తగ్గించాలంటూ ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందించనున్నారు. కాగా, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెంచిన బస్సు చార్జీలను తగ్గించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు.
ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్‌లు, టీ-24 టికెట్ చార్జీలు పెంచిన ఆర్టీసీ…. మరోసారి టికెట్ చార్జీల పెంపుతో ప్రయాణికులపై భారం మోపింది. కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు సిటీ బస్సు మొదటి స్టేజ్ ఫెయిర్ రూ.10 ఉంటే ఇప్పుడు రూ.5 పెంచుతూ రూ.15 చేసింది. ఇలా మొదటి మూడు స్టేజీలకు రూ.5 అదనంగా వసూలు చేస్తున్నది. నాలుగో స్టేజీ నుంచి ఉన్న కనీస చార్జీపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి అల్వాల్ వెళితే రూ.25 అయ్యే చార్జీ రూ.35 అయింది. కాగా, మెట్రో డీలక్స్, ఈ మెట్రో, ఏసీ సర్వీసుల్లో కూడా మొదటి స్టేజీకి రూ.5 పెంపు, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనంగా పెంచింది. 8 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే రూ.50 చెల్లించాల్సి వస్తుంది. ఉచిత బస్సు మినహాయిస్తే టికెట్ తీసుకుంటూ సుమారు 8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.