అబిడ్స్, ఫిబ్రవరి 12: బీఆర్ఎస్ పార్టీకి దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఆదరణ లభిస్తున్నదని ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాజస్థాన్ బిల్వారాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 21 జంటల సామూహిక వివాహ కార్యక్రమానికి ఆయన తన సతీమణి ఉమాదేవి వ్యాస్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం నందకిశోర్ వ్యాస్ మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా రైతు సంక్షేమ ప్రభుత్వం కావాలని ఎదురు చూస్తున్నారంటూ తెలిపారు. రాజస్థాన్ ప్రజలు సీఎం కేసీఆర్ పట్ల మంచి ఆదరణ చూపుతున్నారని తెలిపారు. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వేలాది కుటుంబాలకు తమ ట్రస్ట్ ద్వారా సేవలందించామన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట్ర మంత్రి దినేశ్ గుజ్జార్, సురేశ్ వ్యాస్, విష్ణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.