ఎల్బీనగర్, ఆగస్టు 27 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతామని, అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న ఎల్బీనగర్ను మరింత పరుగులు పెట్టిస్తామని నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజల్లో లేరని, వారికి అభివృద్ధిపై బాధ్యత లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఎన్నడూ నియోజకవర్గంలో కనిపించలేదని, కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడినా, వరదల సమయంలో కష్టాల్లో ఉన్నా చుట్టపు చూపుగా కూడా రాని రేవంత్‌రెడ్డి పత్రికల్లో మాత్రం డాంబికాలు పలుకుతున్నాడని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలు ఒకరితో ఒకరు కొట్లాడుతున్నా ఎల్బీనగర్లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌లు ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉందని, అందరినీ కలుపుకొనిపోయి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మూడు నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ ఒకటి అని, ప్రతి కాలనీ, బస్తీల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్లో రెండో స్థానంలో కూడా బీజేపీ, కాంగ్రెస్‌లు లేవని, ఎన్నికల నాటికి ఎవరు రెండో స్థానమో తేల్చుకునే పనిలో ఆ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం టికెట్ దక్కిన నేపథ్యంలో నమస్తే తెలంగాణతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పలు విషయాలను పంచుకున్నారు.
ప్రతిపక్షాలు ప్రజల్లో లేరు. వారికి అభివృద్ధి బాధ్యత లేదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని గుర్తించని ప్రతిపక్ష నాయకులు తనపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు తప్పా… ప్రజలకు తాము ఇది చేస్తామని చెప్పడం లేదు. నియోజకవర్గంలో రూ. 3292 కోట్ల అభివృద్ధి పనులు చేశాం. మరిన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. ప్రజలకు మేం చేసిన అభివృద్ధి తెలుసు. ఎన్నికల్లో పబ్బం కోసం కాంగ్రెస్, బీజేపీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. ప్రజలకు, భావితరాలకు ఏమి చేయాలనేదే మా ప్రణాళిక. రాష్ట్రంలోని అతిపెద్ద 3 నియోజకవర్గాల్లో ఒకటైన ఎల్బీనగర్లో ప్రతి చివరి కాలనీకి అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాం.
రేవంత్‌రెడ్డి ఏం చేశాడో చెప్పాలి
రేవంత్‌రెడ్డి ఎంపీగా గెలిచి ఎన్నడూ నియోజకవర్గంలో కనిపించలేదు. గెలిచిన నాటి నుంచి ఈ ప్రాంతానికి ఏం చేశాడో చెప్పాలి. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడినా, వరదల సమయంలో ప్రజలు కష్టాల్లో ఉన్నా చుట్టపు చూపుగా కూడా రాని రేవంత్‌రెడ్డి పత్రికల్లో మాత్రం డాంబికాలు పలుకుతాడు. కేవలం బ్లాక్ మెయిలింగ్, పత్రికల్లో ఆరోపణలు తప్ప ఎంపీ దేనికి ఉపయోగపడలేదు. ఎల్బీనగర్ ప్రజలకు ఎంపీ రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ నాయకులకు కూడా ఫోన్లో దొరకరు.
2018 ఎన్నికల్లోఇచ్చిన హామీలను నెరవేర్చాం..
2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నెరవేర్చాను. గొప్ప విజన్ ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తున్నారు. ఆస్తిపన్నులు తగ్గించాం. ఎల్బీనగర్ నియోజకవర్గంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లకూ పన్నుల తగ్గింపు జరిగింది. పండ్ల మార్కెట్‌ను తరలించి ఆ స్థానంలో సీఎం కేసీఆర్ ద్వారా రూ. 1200 కోట్లతో 27 అంతస్తుల అధునాతన 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. చెరువులు సుందరీకరణ పనులు పూర్తవుతున్నాయి. ఎల్బీనగర్లో జీవో 118 ద్వారా 42 కాలనీల్లో 18 వేల కుటుంబాల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించాం. ఆటోనగర్ డంపింగ్ యార్డు స్థానంలో పూల వనం నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు చేయగా కొందరు కోర్టును ఆశ్రయించినందున తాత్కాలికంగా ఆగింది. ఈ కోర్టు కేసు క్లియర్ కాగానే పనులు ప్రారంభిస్తాం.
సీఎం కేసీఆర్నమ్మకాన్ని నిలబెడుతా..
బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడం ఆనందంగా ఉంది. ఎల్బీనగర్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతాం. అభివృద్ధిలో ఎల్బీనగర్ను మరింత పరుగులు పెట్టిస్తాం. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
నియోజకవర్గంలోబీఆర్ఎస్కు పోటీ లేదు..
ఎల్బీనగర్లో ఏ పార్టీ కూడా బీఆర్ఎస్కు పోటీ ఇచ్చే స్థాయిలో లేవు. బీఆర్ఎస్ ఘన విజయం ఖాయం. రెండో స్థానం ఎవరిదనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరో రెండు నెలల్లో వారిలో ఎవరు రెండో స్థానమో తెలుస్తుంది.
అందరిని కలుపుకొని ముందుకెళ్తాం..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. అందరితో సమన్వయం సాధించి ఎన్నికల బరిలోకి ముందుకు వెళ్తాం. కొందరు దురాలోచనతో రాకపోయినా వారిని వదిలేస్తాం. పార్టీ కోసం పనిచేసే అందరినీ కలుపుకుని ముందుకు సాగుతాం.
సమస్యలు లేని నియోజకవర్గంగా మారుస్తా..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం. ఎల్బీనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ఆభివృద్ధికి మార్గాలు వేస్తాం. రాబోయే తరాలకు చేయాల్సిన పనులకు సంబంధించిన హామీలతో ప్రజల ముందుకు వెళ్తాం. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధికి తోడు ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో సమస్యలు లేని సుందరమైన నియోజకవర్గంగా మారుస్తాం. అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు రాబోయే 7 నుంచి 10 సంవత్సరాల వరకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రజలకు మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు రావాల్సి ఉంది. భవిష్యత్తు తరాలకు మంచి సేవలు అందించాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి వెళ్తాం.